Wednesday, November 20, 2024

పెద్ద సినిమాలకు ఎపి ప్రభుత్వం షాక్..

- Advertisement -
- Advertisement -

SC hearing PIL on Delhi Air Pollution

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సినిమాస్(రెగ్యులేషన్-అమైండ్ మెంటు) బిల్లు-2021ను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ”పేద, మధ్యతరగతి వర్గాలకు, కష్టపడే కష్టజీవులకు ప్రధాన వినోదాత్మకం సినిమా మాధ్యమం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత పోకడల్లో సినిమా పట్ల పేద, మధ్యతరగతి వర్గాలకు ఉన్న ఆపేక్ష, ప్రేమను కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్దేశిత విధివిధానాలను పట్టించుకోవడం లేదు. థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే వేయాలని చట్టం చెబుతున్నా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. థియేటర్లలో తెల్లవారుజాము నుంచే సినిమా షోలు వేయటం, ఒక్కొక్క వీక్షకుడి నుంచి ఇష్టారాజ్యంగా మూడు వందలు నుంచి ఐదు వందలు వరకు వసూలు చేసి, పేద, మధ్యతరగతి వర్గాల ఇష్టాన్ని సొమ్ము చేసుకోవటం జరుగుతోంది. రోజుకు నాలుగు ఆటలు ప్రదర్శించాల్సిన సినిమా థియేటర్‌లో లెక్కకు మిక్కిలిగా ఆరు, ఏడు షోలు ప్రదర్శిస్తున్నారు. సినిమా పరిశ్రమలో మాకు ఎదురు ఉండకూడదు. సినిమా పరిశ్రమలో మేం ఏమి చేసినా చట్టాలు ఆపజాలవు… అనే రీతిలో పోకడలు చూస్తున్నాము. పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రధాన వినోదంగా ఉన్న సినిమా టిక్కెట్ల రేట్లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి, ప్రేక్షకుల బలహీనతను సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయటానికి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం ద్వారా టిక్కెట్ల వ్యవస్థ తీసుకురావాలని నిర్ణయించింది. ఉదాహరణకు బస్సు టిక్కెట్‌ను ఆన్ లైన్ లో ఎలా బుక్ చేసుకుంటున్నామో.. అలాగే సినిమా టిక్కెట్లను కూడా మొబైల్, ఆన్‌లైన్‌ ద్వారా, థియేటర్‌లో గంట ముందు బుక్ చేసే అవకాశం ఉంది. తద్వారా సినిమా థియోటర్లలో షోలు కూడా ఎవరిష్టం వచ్చినట్లు వారు కాకుండా.. ప్రభుత్వం నిర్దేశించిన సమయాల ప్రకారం షోలు ప్రదర్శించాలి. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడే సినిమా పరిశ్రమ నడుచుకోవాలి తప్ప ఇష్టారాజ్యంగా నడిచే అవకాశం ఉండదు. ప్రజలకు మేలైన, మెరుగైన సౌకర్యాలు కల్పించటం కోసం, ఇంటి వద్ద నుంచి ఫోన్‌లోనే ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే సినిమా టిక్కెట్లు లభ్యమవటానికి సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకురావాలనుకున్నాం. దీనివల్ల ఆన్‌లైన్‌ సౌలభ్యం అందుబాటులోకి వస్తుంది.

 అదొక్కటే కాకుండా.. చాలా చోట్ల సినిమా కలెక్షన్లు కానీ, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మొత్తాలకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన జీఎస్టీతో పోల్చి చూసినా ఎక్కడా పొంతన కనపడటం లేదు. ఆన్‌లైన్‌ సిస్టం పెడితే.. ప్రభుత్వానికి వచ్చే పన్నులు పోర్టల్‌లో తెలుస్తాయి. ప్రజలకు టిక్కెట్‌ కూడా సరసమైన రేటుకే లభ్యమవుతుంది. ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు కూడా ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా వస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వంపై బురద చల్లటానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సినిమా వారు, సినిమా థియేటర్ల యజమానులో, డిస్ట్రిబ్యూటర్లో విమర్శలు చేస్తున్నారంటే ఓ అర్థముంటుంది. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతలు నిందలేస్తే దానికి ఓ అర్థముంటుంది. కానీ ఓ రాజకీయ పార్టీ, వారికి అనుకూలంగా ఉండే, లోపాయికారీ సంబంధాలు నడిపే కొన్ని పార్టీలు, పత్రికలు, టీవీ ఛానల్స్‌.. ప్రభుత్వం మీద, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్ విధానంపై బురద వేయటం చూస్తుంటే.. ఎంత దుర్మార్గంగా ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో స్టేక్‌ హోల్డర్స్‌గా ఉన్న థియేటర్ల యజమానులకు, స్టేక్‌ హోల్డర్స్‌గా ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు, స్టేక్‌ హోల్డర్స్‌గా ఉండబోయే ప్రొడ్యూసర్లకు కూడా ఇబ్బంది లేదు. రాష్ట్రంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలకే ఇబ్బంది. అసెంబ్లీలో కనపడకుండా పోయిన రాజకీయ పార్టీ గానీ, వారిని భుజాన వేసుకుని పల్లకీ మోసే కొన్ని ప్రచార మాధ్యమాలకే ఈ ఇబ్బంది ఉంది. బయట ఏమో మా ఆశయాలు వేరు.. మాకు, ఆ పార్టీకి పడదంటారు. మళ్ళీ ఆ పార్టీని భుజాన ఎత్తుకొని, వారు ఏమంటే.. దానికి వారు తందాన అంటూ తప్పులు జరుగుతున్నట్లు మాట్లాడుతున్నారు. పైగా సినిమా కలెక్షన్లు అన్నీ ప్రభుత్వ రాబడిగా చూపించి.. బ్యాంకుల్లో అప్పులు తెస్తామంటూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గడిచిన రెండున్నరేళ్ళుగా చూస్తున్నాం. ప్రజలకు మంచి చేస్తున్నా.. ఆ రాజకీయ పార్టీలు, వాళ్ళకు వంత పాడే మీడియా ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. దున్నపోతు ఈనిందంటే… దూడను కట్టేయండి అనే విధంగా చంద్రబాబు, ఆయనకు సంబంధించిన పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

సినిమా ప్రదర్శించే.. గంట ముందు కూడా సినిమా హాల్లోనే డబ్బులు తీసుకుని థియేటర్ల యజమానులు టిక్కెట్లు అమ్ముకోవచ్చు. ఆన్ లైన్ లో ఫ్లైట్, బస్సు, రైలు టికెట్లు కొనుగోలు చేసిన మాదిరిగానే.. ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ తీసుకుంటే చంద్రబాబు, ఆయనకు వంతపాడే పార్టీలకు, మీడియాకు, ఎందుకు అభ్యంతరమో అర్థం కావడం లేదు. టిక్కెట్ ఎవరికి దొరికితే.. వారు మాత్రమే సినిమా చూసే విధంగా, ప్రజలకు అత్యంత సౌకర్యంగా ఉండేందుకే ఈ విధానం తీసుకొస్తున్నాం. ఈ విధానం సినీ అభిమానులకు చాలా ఉపయోగకరం. ఫిలిం డెవలప్ మెంటు కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రుణాల కోసమే.. ఈ విధానం తీసుకొస్తుందనే పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టాలి. అత్యంత పారదర్శకంగా, ప్రజలకు అందుబాటు ధరలకు సినిమా వినోదాన్ని అందించేందుకే ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. సినీ అభిమానుల జేబులు గుల్ల చేయకుండా, వారిని దోచుకోకుండా సినిమా చూసే అవకాశం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. థియేటర్ దాకా వెళ్ళి, టిక్కెట్ దొరుకుతుందో, లేదో తెలియకుండా, టిక్కెట్ దొరికిన తర్వాతే.. ఓ నమ్మకంతో సినిమా చూసే అవకాశం ఈ విధానం ద్వారా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సినిమాస్(రెగ్యులేషన్-అమైండ్ మెంటు) బిల్లు-2021కు మద్దతు పలికి, ఆమోదించమని చివరిగా మంత్రి పేర్ని నాని కోరారు. సభ్యుల ఆమోదంతో బిల్లును ఆమోదించినట్టు స్పీకర్ తెలిపారు.

AP Assembly passes Cinemas bill 2021 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News