ఆదేశించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వాయు కాలుష్యం పెరిగిపోతున్న దృష్టా ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్‌సిఆర్)లో నిర్మాణ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు మళ్లీ నిషేధాన్ని విధించింది. ఈ నిషేధం కొనసాగిన కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు కార్మిక సెస్సు కింద వసూలు చేసిన నిధుల నుంచి జీవనోపాధి కల్పించాలని సంబంధిత రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గడచిన సంవత్సరాలకు సంబంధించిన గణాంకాల ఆధారంగా వాయు నాణ్యతపై శాస్త్రీయ అధ్యయనం చేపట్టవలసిందిగా ఎన్‌సిఆర్‌లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్‌ను బుధవారం రాత్రి అప్‌లోడ్ చేసిన తాత్కాలిక ఉత్తర్వులో చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఆదేశించింది. వాయు కాలుష్యం స్థాయి స్వల్పంగా పెరిగిన కారణంగా నవంబర్ 22 నుంచి నిర్మాణ కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతిస్తూ గతంలో జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్యం పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సిఆర్ పరిధిలోకి వచ్చే ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలను ధర్మాసనం ఆదేశించింది.