తేల్చుకోవాలని యుపి సిఎం ఆదిత్యయోగి ప్రశ్న
నొయిడా : చెరకు పండించి తీపినందించే పాలకులు కావాలా ? పాక్ సంస్థాపకుడు జిన్నా అనుచరులు సృష్టించే అల్లర్లు కావాలా ? అన్నది ప్రజలు తేల్చుకోవాలని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ గురువారం ప్రశ్నించారు. గురువారం నొయిడా అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన విపక్షాలను దృష్టిలో పెట్టుకుని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెబుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు.
విమానాశ్రయ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా 7000 కు పైగా రైతులు తమ భూములను అందజేశారని వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. తీపిని పంచే చెరకు సాగుకు ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లో కొందరు అనేక విధ్వంసాల ద్వారా చేదును పంచడానికి ప్రయత్నిస్తున్నారని, అందువల్ల విధ్వంసం కావాలో, చెరకు తీపి కావాలో దేశం నిర్ణయించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. నొయిడా, గ్రేటర్ నొయిడా బుద్ధనగర్‌లో మౌలిక వసతులకు సంబంధించి అనేక వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయని, దీనివల్ల లక్షలాది ఉద్యోగాలు లభించే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. గౌతమబుద్ధ నగర్ ఎంపి మహేష్ శర్మ, స్థానిక ఎంఎల్ఎ ధీరేంద్ర సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.