మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి చెందిన మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల పుణ్యక్షేత్రంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.విషయం గ్రహించిన స్థానికులు ఆమెను 108 అంబులెన్స్‌లో సున్నిపెంటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సదరు బాధిత మహిళ వద్ద సరూర్‌నగర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపీ లభ్యమైంది.
వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌కు చెందిన అభిలాష్‌రెడ్డి, మౌనిక భార్యభర్తలు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. అయితే వివాహం జరిగినప్పటి నుంచి భర్త అభిలాష్‌రెడ్డి భార్య మౌనికను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. దీంతో విసుగుచెందిన మౌనిక భర్త అభిలాష్‌పై రెండు నెలల క్రితం సరూర్ నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మహిళ పోలీస్ స్టేషన్లో ఇద్దరికి కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. అయితే బుధవారం నాడు చివరి సారి అభిలాష్‌తో మాట్లాడిన మౌనిక శ్రీశైలం వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈక్రమంలో మౌనిక ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసిందో ఇంకా తెలియరాలేదు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి సున్నిపెంట ఆసుపత్రికి చేరుకున్నారు. శ్రీశైలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Woman Software suicide attempt in Srisailam