అతి తక్కువ పేదరికంలో కేరళ, తమిళనాడు, పంజాబ్
నీతి ఆయోగ్ పావర్టీ ఇండెక్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలోని నిరుపేద రాష్ట్రాల్లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్ నిలిచాయి. బీహార్‌లో 51.91 శాతం మంది, జార్ఖండ్‌లో 42.16 శాతం మంది, ఉత్తరప్రదేశ్ జనాభాలో 37.79 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 36.65 శాతం మంది పేదలని తెలిపింది. నీతి ఆయోగ్ మొట్టమొదటి సారిగా విడుదల చేసిన మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్( ఎంపిఐ) ఈ వివరాలను తెలిపింది. ఎంపిఐలో మేఘాలయ ఐదో స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ని జనాభాలో 32.67 శాతం మంది పేదలున్నారు. కాగా కేరళలో అతి తక్కువగా 0.71 శాతం మంది పేదలుండగా, గోవాలో 3.76 శాతం, సిక్కింలో 3.82 శాతం, తమిళనాడులో 4.89 శాతం, పంజాబ్‌లో 5.59 శాతం పేదలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
‘భారత దేశ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ను అభివృద్ధి పరచడం ప్రభుత్వ విధాన సాధనం ఏర్పాటు దిశగా సాగుతున్న ముఖ్యమైన కృషి. ఇది బహుముఖ పేదరికాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. సాక్షాధారాల సహితంగా , ప్రత్యేక దృష్టితో కూడిన అంశాలను తెలియజేస్తుంది.తద్వారా ఎవరూ వెనుకబడి ఉండకుండా తగిన చర్యలు తీసుకునేలా తోడ్పడుతుంది’ అని ఈ నివేదిక ముందు మాటలో నీతి ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం ( ఎన్ఎఫ్హెచ్ఎస్)2015 16 ఆధారంగా ఈ ఎంపిఐని రూపొందించారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, జీవన ప్రమాణాలు వంటి 12 అంశాలను పరిశీలించి దీన్ని రూపొందించారు.