న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై సిబిఐ, ఇడి దాఖలు చేసిన చార్జీషీట్లను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు శనివారం వారిద్దరినీ డిసెంబర్ 20న కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు జారీచేసింది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) దాఖలు చేసిన అవినీతి, మనీలాండరింగ్ కేసులలో చిదంబరం, ఇతర నిందితులపై సమన్లు జారీచేయడానికి తగిన ఆధారాలు ఉన్నాయని భావించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకె నాగపాల్ ఉత్తర్వులు జారీచేశారు. కేసు దర్యాప్తునకు సంబంధించి కొంత సమాచారం కోసం బ్రిటన్, సింగపూర్‌కు లెటర్స్ రొగేటరీని పంపామని, ఈ విషయంలో కొంత పురోగతి ఉందని సిబిఐ, ఇడి అంతకుముందు కోర్టుకు తెలిపాయి. ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపిబి) అనుమతి ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని సిబిఐ, ఇడి ఆరోపిస్తున్నాయి. 2006లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు ఈ అనుమతి మంజూరైంది. తన అధికార పరిధిని అతిక్రమించి కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చడానికి ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతి ఇచ్చి ముడుపులు పొందారన్నది సిబిఐ, ఇడి ఆరోపణ.
ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో చిదంబరం, కార్తీకి కోర్టు సమన్లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -