విద్యాసంస్థలు, షాపింగ్‌మాల్స్‌లో జాగ్రత్తలు పాటించేలా చర్యలు
టెక్ మహీంద్ర యూనివర్శిటీ కేసులతో వైరస్ విజృంభణ చేస్తుందని వెల్లడి
గురుకుల వసతిగృహాలు, పాఠశాలల్లో అవగాహన చేయనున్న వైద్యసిబ్బంది
పెళ్లిళ్లు, మార్కెట్లలో గుంపులుగా తిరగవద్దని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు
హైదరాబాద్: నగరంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మొన్నటివరకు వరుస పండగలు వచ్చిన వైరస్ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం స్కూళ్లు, కళాశాల్లో మహమ్మారి ఉనికి చాటుతుంది. దీంతో వైద్యశాఖ పాఠశాల యాజమాన్యాలతో పాటు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. రెండు రోజుల కితం నగర శివారు ప్రాంతంలో ఉన్న టెక్ మహీంద్ర యూనివర్శిటీలో 25 మంది విద్యార్ధులకు వైరస్ సోకడంతో వైరస్ రెక్కలు కట్టుకునే అవకాశం ఉందని, దీనికితోడు అకాల వర్షాలు, చలితీవ్రత పెరగడంతో వేగంగా కరోనా పుంజుకునే వాతావరణం ఎక్కువ ఉంటుందని అధికారులు స్దానికంగా ఉండే వైద్య సిబ్బందితో స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన చేపట్టి, విద్యార్థులు, అధ్యాపకులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడిస్తున్నారు.
ప్రధానంగా గురుకులాల వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులు వైరస్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యతలు వైద్యశాఖతో పాటు విద్యశాఖ అధికారులు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాఠశాల నిర్వహకులు విద్యార్థులంతా ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా చూడటంతో పాటు ప్రతి రోజు తరగతి గదులను శానిటైజర్ చేయాలని, లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేషన్ గదిలో ఉంచాలని నిర్లక్షం చేస్తే విద్యాసంస్దలు మూసివేసే పరిస్దితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా షాపింగ్‌మాల్స్, బార్లు, సినిమా థియేటర్లు ఖచ్చితంగా నిబంధనలు పాటించేలా జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచనలు చేస్తున్నారు. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పరిశీలిస్తే ఈనెల 26వ తేదీన 75మంది సోకినట్లు, 25న 56 కేసులు, ఈనెల 24వ తేదీన 55మందికి, ఈనెల 23న 60 కేసులు, ఈనెల 22వ తేదీన 54 మందికి, ఈనెల 21న 49మంది వైరస్ సోకినట్లు వైద్యాశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగర ప్రజలు వైరస్ పట్ల నిర్లక్షం వహిస్తే పాజిటివ్ కేసులు పెరిగే అవకాశముందని, మార్కెట్లు, పెళ్లి కార్యాలో గుంపులుగా చేరకుండా వీలైనంత వరకు భౌతికదూరం పాటించాలని పేర్కొంటున్నారు.