‘ఒమిక్రాన్’ కలకలంతో అప్రమత్తమైన మహారాష్ట్ర, గుజరాత్
ఢిల్లీ, కేరళలో ముందస్తు జాగ్రత్తలు
ముంబయి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి కూడా. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తగా ఉండాలని రాష్ట్రాలను ప్రధాని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త గౌడ్‌లైన్స్ విడుదల చేసింది. రాష్ట్రానికి వచ్చే విదేశీ ప్రయాణికులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అదేశాలను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రానికి వచ్చే దేశీయ ప్రయాణికులు తప్పనిసరిగా టీకా రెండు డోసులు తీసుకుని ఉండాలి. లేదా 72 గంటలు ముందు చేసిన ఆర్‌టిపిసిఆర్ టెస్ట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా తీసుకు రావాలని పేర్కొంది. దక్షిణాఫ్రికానుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని ఆ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేశారు. అలాగే బస్సు.
టాక్సీ, ఇతర వాహనాల్లో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవర్, కండక్టర్ రూ.500లు చెల్లించాలి, అలాగే ప్రైవేటు బస్సుల్లో ఉల్లంఘనలు చోటు చేసుకుంటే ట్రాన్స్‌పోర్టు యజమాని రూ.1000 జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం కూడా విదేశాలనుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టిపిసిఆర్ టెస్టును తప్పనిసరి చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ ‘ప్రమాదం ఉన్న దేశాలు’గా వర్గీకరించిన దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్స్‌వానా, చైనా, మారిషస్, న్యూజిలాంగ్, జింబాబ్వే దేశాలనుంచి వచ్చే ప్రయాణికులు పూర్తి టీకా డోసులు తీసుకోకపోతే విమానాశ్రయంలో తప్పనిసరిగా ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు చేయించుకోవలసి ఉంటుందని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి మనోజ్ అగర్వాల్ తెలిపారు. పూర్తి డోసులు తీసుకున్న వారు సైతం విమానాశ్రయాల్లో పరీక్షలు చేయించుకోవలసి ఉంటుందని, వారికి కొవిడ్ లేదని నిర్ధారణ అయితేనే వెళ్లడానికి అనుమతిస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు ఈ దేశాలనుంచి వచ్చే ప్రయాణికులు 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
కాగా ‘రిస్క్’ ఉన్న దేశాలనుంచి ఢిల్లీ వచ్చిన ప్రయాణికుల్లో ఎవరిలోను ఇప్పటివరకు కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించలేదని విమానాశ్రయంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించే సంస్థ జెనెస్ట్రింగ్స్ డయాగ్నస్టిక్ సెంటర్ వ్యవస్థాపకురాలు గౌరీ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అయినప్పటికీ కేంద్రం సూచించిన ప్రకారం ఈ దేశాలనుంచి వచ్చే ప్రయాణికులందరికీ కఠిన పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని ఆమె చెప్పారు. మరో వైపు కొత్త వేరియంట్‌కు సంబంధించి రాష్ట్రంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి చెప్పారు.