Monday, September 23, 2024

ధాన్యంపై పార్లమెంట్ ను దద్దరిల్లిస్తాం

- Advertisement -
- Advertisement -

We will dispose Center in Parliamentary sessions on grain:MP Nama

హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన హక్కులపై గళమెత్తుతామని ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇచ్చేంతవరకు పార్లమెంట్ను దద్దరిల్లిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం సరైన సమాధానం ఇచ్చేవరకు పార్లమెంట్ లోపల, బయటా పోరాడతామని నామ నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెరాస పక్షాన ఎంపీ బండా ప్రకాశ్ తో కలిసి ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఎంపీ నామ మాట్లాడుతూ… తెలంగాణలో పంట మొత్తం కొనే బాధ్యత కేంద్రం పై ఉందని పేర్కొన్నారు .

పంట కొనుగోలుపై కేంద్రంతో రెండు నెలల్లో నాలుగు ఐదు సార్లు సీఎం కేసీఆర్, మంత్రులు చర్చించినట్లు తెలిపారు. చివరికి చేతులెత్తేసి ధాన్యం కొనుగోలు చేయబోం అని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంట అసలే కొనం అంటున్నారని… ఎంత కొంటామో కూడా చెప్పం అని అంటున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలని, ఇదే అంశాన్ని పార్లమెంట్ లేవనెత్తుతామని వివరించారు . హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని అన్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని అఖిల పక్ష సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. వ్యవసాయ బిల్లుల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఎంపీ నామ డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన ఒక్కొ రైతు కుటుంబానికి మూడు లక్షల సహాయం అందిస్తుందని, కేంద్రం కూడా ఈ విషయంలో ముందుకు వచ్చి తమవంతు సహాయం అందించాలన్నారు. అలాగే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష సమావేశంలో కేంద్రం 37 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించిందన్నారు. గతంలో మాదిరిగా బిల్లులను ఎటువంటి చర్చలు లేకుండా పాస్ చేయొద్దని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్యుత్ బిల్లుల విషయంలో కూడా లోపలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు. దేశంలో రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనన్నారు. విద్యుత్ బిల్లులను దేశవ్యాప్తంగా వ్యతిరేకించే అవకాశం ఉందని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల పక్షాన తెరాస పార్లమెంట్ లో వ్యతిరేకించి బిల్లు రద్దుకు పోరాటం చేస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎపట్నుంచో పెండింగ్ లో ఉందని దాన్ని కూడా ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని.. డిమాండ్ చేసినట్లు తెలిపారు.

సిఎం కేసిఆర్ దిశా నిర్దేశం మేరకు సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణకు, తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను పార్లమెంట్ లో లేవనెత్తుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గీకరణ గురించి అసెంబ్లీలో తీర్మానాలను చేసి కేంద్రంకు పంపించినా మూడేళ్లుగా పెండింగ్ లోనే ఉంచారని దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. జనగణన వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ సహా ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News