రక్తదానం చేసిన ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం
టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవకాశం కల్పించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని తలసేమియా బాధితుల కోసం ఆర్టీసీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోందని, రెడ్‌క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసి ఉద్యోగులు సైతం రక్తదానం చేయడానికి ముందుకు రావాలని సంస్థ టిఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో ఏర్పడిన రక్తం కొరతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎండి సజ్జనార్ వెల్లడించారు.
ప్రహరీ ట్రస్ట్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, టిఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని ఆర్టీసీ బస్ డిపోల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ సమయంలో చాలామంది రక్తం కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నారని చిన్నపిల్లలకు, గర్భిణులకు, క్యాన్సర్, తలసేమియా రోగులకు రక్తం చాలా అవసరం ఉందని అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు.