తల్లి, కొడుకు దుర్మరణం, కాపాడబోతూ కారు డోరులో కాలు ఇరుక్కొని మృతిచెందిన గజ ఈతగాడు, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘోర విషాదం
మన తెలంగాణ/దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నందిగామ గ్రామానికి చెందిన ఆకుల భాగ్యలక్ష్మి(50), ఆమె కుమారుడు ప్రశాంత్ (26) బుధవారం ఉదయం సిద్దిపేటకు ఏపీ23ఆర్ 5566 కారులో వస్తుండగా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామ శివారులో కారు ముందు వీల్ టైర్ ఊడిపోవడంతో పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీం అధికారులు ఏసీపీ దేవారెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మోటార్లను ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్ల సహాయంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8.30 గంటల వరకు శ్రమించి కారును బయటకు తీశారు.
కాపాడడానికి వెళ్లిన వ్యక్తి మృతి : బావిలో పడ్డ కారును, అందులోని వారిని భయటకు తీయడానికి వెళ్లిన ముగ్గురు గజ ఈత గాళ్లలో దుబ్బాక మండలం ఎనగుర్తి గ్రామానికి చెందిన నర్సింలు(45) కూడా ప్రమాదవశాత్తు కారు డోరులో కాలు ఇరుక్కుని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లత, కుమారుడు, కూతురు ఉండగా, అంతకుముందు బావిలో పడ్డ కారును చూడడానికి ప్రజలు తండోపతండాలుగా రావడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. కాగా బావిలో పడ్డ కారు విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8.30 గంటల వరకు అక్కడే ఉండి బావిలో పడ్డ కారును తీయించారు.