Sunday, November 24, 2024

స్టార్‌లపై ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు

- Advertisement -
- Advertisement -

IPL 2022:List of All Teams Retained Players

రషీద్, హార్దిక్, వార్నర్, రాహుల్‌లకు ఊహించని షాక్

ముంబై: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ కోసం ఆయా ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) విధించిన గడువు మంగళవారంతో ముగిసింది. దీంతో తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఫ్రాంచైజీలు విడుదల చేశాయి. ఈసారి తమ వద్ద అట్టిపెట్టుకునే ఆటగాళ్ల విషయంలో పలు ఫ్రాంచైజీలు అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. ఏళ్ల తరబడి తమ జట్ల తరఫున ఆడుతున్న దిగ్గజ ఆటగాళ్లను సయితం వదిలి పెట్టేందుకు ఫ్రాంచైజీల యాజమాన్యాలు వెనకాడలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తీసుకున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. సన్‌రైజర్స్‌కు చాలా కాలంగా ప్రధాన అస్త్రాలుగా ఉన్న వార్నర్, రషీద్ ఖాన్, జానీ బెయిర్‌స్టో తదితరులను ఆ జట్టు వదులు కోవడం పెను సంచలనం సృష్టించింది.

వార్నర్‌ను వదిలి పెట్టడం ఖాయమని అందరూ భావించినా అనూహ్యంగా బెయిర్‌స్టో, రషీద్ ఖాన్‌లను కూడా రిటైన్ చేసుకోవడంపై సన్‌రైజర్స్ ఆసక్తి చూపలేదు. ఇది ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. బెయిర్‌స్టో, రషీద్‌లను హైదరాబాద్ చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు సయితం అంచన వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ సన్‌రైడర్స్ యాజమాన్యం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను హైదరాబాద్ అట్టి పెట్టుకుంది. వీరిద్దరూ కాకుండా కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను కూడా సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. భువనేశ్వర్ కుమార్, విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా, హోల్డర్ తదితరులను హైదరాబాద్ వదులుకుంది.

రాహుల్‌కు షాక్..

మరోవైపు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని సీజన్లుగా పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్.రాహుల్ పంజాబ్ వదులుకుంది. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాహుల్ బాగానే రాణించాడు. దీంతో ఈసారి కూడా అతనికి పంజాబ్ అట్టి పెట్టుకోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. గేల్‌తో సహా పలువురు స్టార్ ఆటగాళ్లను పంజాబ్ వదులు కుంది.

శ్రేయస్‌కు దక్కని చోటు

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. తమ స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకోలేదు. గాయం వల్ల అయ్యర్ ఐపిఎల్ తొలి దశ మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అతని స్థానంలో రిషబ్ పంత్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంతో పంత్‌వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపింది. ఈసారి పంత్‌తో పాటు పృథ్వీషా, అన్రిజ్ నోర్జేలను ఢిల్లీ అట్టిపెట్టుకుంది. అయ్యర్‌పై ఆసక్తి చూపించలేదు. అక్షర్ పటేల్‌పై మరోసారి నమ్మకం ఉంచింది.

హార్దిక్‌పై ఆసక్తి చూపని ముంబై

ఇదిలావుండగా కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ముంబై ఇండియన్స్ షాక్ ఇచ్చింది. రిటైన్ జాబితాలో హార్దిక్‌కు చోటు కల్పించలేదు. అతనికి బదులు సూర్యకుమార్ యాదవ్‌పై ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆసక్తి చూపించింది. ఒకప్పుడూ ముంబైకు హార్దిక్ ప్రధాన అస్త్రంగా ఉన్నాడు. అయితే కొన్ని సీజన్‌లుగా అతను గాయాలతో సతమతమవుతున్నాడు. బౌలింగ్ చేయలేక పోతున్నాడు. బ్యాటింగ్‌కే పరిమితం కావడంతో అతనిపై ముంబై యాజమాన్యం అంతగా ఆసక్తి చూపించలేదు. అంతేగాక ఇషాన్ కిషన్‌కు కూడా షాక్ ఇచ్చింది. కోల్‌కతా కూడా దినేశ్ కార్తీక్, కమిన్స్ వంటి క్రికెటర్లపై ఆసక్తి చూపలేదు. బెంగళూరు కూడా యజువేంద్ర చాహల్‌ను వదులుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News