పోలవరంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘించినందుకు రూ.120 కోట్ల జరిమానా
మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు పోలవరం పరిధిలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులపై రూ.120 కోట్లు జరిమానా విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యూనల్ (ఎన్‌జిటి) గురువారం నాడు తీర్పునిచ్చింది. ఈక్రమంలో పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే పోలవరం అనుబంధ ప్రాజెక్టులను డిజైన్ చేసి నిర్మిస్తున్నారని పెంటపాటి పుల్లారావు, వట్టి వసంతకుమార్ లు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేసిన ఎన్‌జిటి ఈ మేరకు పర్యావరణ ఉల్లంఘనలపై విచారణ చేపట్టి జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న పురుషోత్తపట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమకు రూ. 24.90 కోట్లు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 73.6 కోట్ల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఎపి కాలుష్య నియంత్రణ మండలికి ఎన్‌జిటి ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఆంధ్రప్రదేశ్ పిసిబి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్‌జిటి ఆదేశించింది.
పురుషోత్తమపట్నం, పట్టిసీమ, చింతలపూడి మూడు పోలవరంలో భాగమైన ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులు. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్‌జిటిలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఏలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపైనా ఎన్‌జిటి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వాటిపై విచారణ జరుపుతోంది. ఈ మూడు ప్రాజెక్టులు అక్రమం అని గతంలోనే ఎన్‌జిటి తీర్పు ఇచ్చింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరంలో భాగం కాదని కేంద్రజలశక్తి శాఖ ఎన్‌జిటికి చెప్పడంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదిలావుండగా కాగా ఇ్పపటికే ఈ నిర్మాణానికి సంబంధించి ఎపి ప్రభుత్వం వేగవంతంగా పనులను చేపడుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాలలకు తాగునీటి కష్టాలు తీరుతాయని, అలాగే విశాఖపట్నం మహానగరానికి సైతం తాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు. కేవలం తాగు, సాగు నీరుతో పాటు చేపల పెంపకానికి, జలరవాణాకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉందని, మిగులు జలాలను నదుల అనుసంధానంలో భాగంగా కృష్ణా నదితో కలిపే ప్రయత్నం చేస్తున్న విషయం విదితమే.