Friday, November 15, 2024

కోర్టు ఆఖరి అస్త్రం కావాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో శనివారం నాడు జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథులుగా సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ.. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఐఎఎంసి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని, విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు సత్వరమే న్యాయం జరుగుతుందని, బాధితులు కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని, దీంతో పెండింగ్ కేసులు సత్వర విచారణ సులభతరమౌతుందన్నారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉన్నదని, శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడని వివరించారు. ఇరు పక్షాల సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తేవచ్చని, ముఖ్యంగా ఆస్తుల పంపకాలను కుటుంబ సభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సాధ్యమైనంతవరకు మహిళలు మధ్యవర్తిత్వంలో వివాదాలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రతిరోజూ సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మొట్టమొదటగా మీ దేశంలో పెట్టుబడులు పెట్టమని అడుగుతున్నారని, అలాగే ఏదైనా లిటిగేషన్ వస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుందని అడుగుతున్నారన్నారు.

సమాజంలో గుర్తింపు, గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా తీర్పు చెప్పడానికి అర్హుడేనని, దీనికి లా డిగ్రీలు అవసరం లేదన్నారు. ఈ మీడియేషన్ సెంటర్ ఒక్క ఇండస్ట్రీయలిస్టులకే కాదని, సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉంటుందని వివరించారు.తన 40 సంవత్సారాల అనుభవంతో చెబుతున్నానని, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ సరైన వేదిక అని చెప్పారు. ఇప్పటికే పారిస్, సింగపూర్, లండన్, హాంకాంగ్‌లో ఆర్బిట్రేషన్ సెంటర్లు ఉన్నాయన్నారు. తాను సింగపూర్ సిజెతో కూడా మాట్లాడానని, ఇందుకు వారు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. హైదరాబాద్‌లోనే ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని, తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో సిఎం కెసిఆర్‌తో ఈ సెంటర్ గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారని, ఈ మీడియేషన్ సెంటర్ కోసం భూమి కేటాయించినందుకు సిఎం కెసిఆర్‌కు సిజెఐ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.

నగరంలో ఐఎఎంసి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఆయన తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని, అతితక్కువ కాలంలోనే హైదరాబాద్ నగరంలో ఎమర్జింగ్ సిటీగా ఎదిగిందన్నారు. హైదరాబాద్ అన్ని రకాల సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు అనువైనదన్నారు. ఇక మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ లాంటి వేదికల రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నదని, ముఖ్యంగా గ్రామాల్లో పెద్దలు పంచాయతీలు ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించేవారన్నారు. దేశంలో వివిధ కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయని, దేశంలో కోర్టులు, సిబ్బంది కొరత కారణంగా ఇలాంటి వివాదాల ఏండ్ల కొద్ది సమస్యలు, పంచాయతీలు పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సంబంధించిన వివాదాలు తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఆర్బేట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయిస్తున్నామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ సన్నాహక సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు,మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

CJI Chief NV Ramana Speech in IAMC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News