నేచులర్ స్టార్ నాని హీరోగా చేస్తున్న ‘శ్యామ్‌సింగ రాయ్’ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈనెల 7న సిరివెన్నెల రాసిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేయబోతోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట కావడంతో ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ పాటకు ఎంత ప్రాముఖ్యత ఉందో నాని, రాహుల్ సంకృత్యాన్ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ “నవంబర్ 3న సిరివెన్నెల ఫోన్ చేసి… ఆరోగ్యం బాగా లేకపోవడంతో పాటను పూర్తి చేయలేకపోతున్నానని అన్నారు. ఎలాగైనా సరే పాటను పూర్తి చేయండని మేము కోరాము. ఆ తెల్లారే ఆయన ఫోన్ చేసి మమ్మల్ని నిద్రలేపారు. ఆ రోజు దీపావళి. పల్లవి చెబుతాను రాసుకోండని అన్నారు.
‘మహాభారతంపైన ఆరు లైన్లు రాశాను. ఇందులోని ఓ లైన్‌లో సిరివెన్నెల అని ఉంది. ఇదే నా చివరి పాట అవుతుందేమో’అని ఆయన నవ్వుతూ అన్నారు. విధి అంటే ఇదేనేమో. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఈ పాటను రికార్డ్ చేశాం’ అని అన్నారు. నాని మాట్లాడుతూ “సిరివెన్నెల అనే పాట ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన చివరి పాట ఇది. ఆయన మరో పాటను కూడా రాశారు. దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం. ‘శ్యామ్‌సింగ రాయ్’ సినిమాను సిరివెన్నెలకి అంకితమిస్తున్నాం”అని తెలిపారు. “సిరివెన్నెల పాటకు మిక్కీ జే మేయర్ క్లాస్ ట్యూన్ ఇచ్చారు. అనురాగ్ కులకర్ణి ఆలపించారు. సాంగ్ ప్రోమోను విడుదల చేస్తున్నాం. పూర్తి పాట కావాలంటే మరో మూడు రోజులు ఎదురుచూడాల్సిందే” అని నిర్మాత అన్నారు. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది.
Sirivennela’s song release from Shyam Singha Roy on Dec 7