సింగపూర్: గతంలో వెలుగు చూసిన డెల్టా, బీటా వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్‌తో రీ ఇన్‌పెక్షన్ ముప్పు అధికంగా ఉండనుందని సింగపూర్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న క్లినికల్ అద్యయనాల ద్వారా ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. కరోనా నుంచి కోలుకున్నవారు కూడా ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువే అని వివరించింది. అయితే ఈ వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉందని అభిప్రాయపడింది. ఒమిక్రాన్ ను ఎదుర్కోవడం, వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ప్రస్తుతం ఉన్న టీకాలు కొంతవరకు పనిచేస్తున్నాయని అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు పేర్కొంది. ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని, ఇంతవరకు దీనివల్ల మరణాలు కూడా నమోదు కాలేదని తెలియచేసింది.
అయితే ఈ అంశాలతో ఒమిక్రాన్‌పై అభిప్రాయానికి రావడం సరికాదని, దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. అప్పటివరకు ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, టీకాలు, బూస్టర్ డోసులు తీసుకోవాలని అభ్యర్ధించింది. సింగపూర్‌లో ఆదివారం మరో ఒమిక్రాన్ అనుమానిత కేసు వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలిందని సింగపూర్ ఆరోగ్యశాఖ తెలియచేసింది. రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ఆ మహిళ డిసెంబర్ 1న దక్షిణాఫ్రికా నుంచి సింగపూర్‌కు వచ్చిన మరో ఇద్దరు ఒమిక్రాన్ అనుమానిత వ్యక్తులు ప్రయాణించిన విమానం లోనే ఉన్నట్టు చెప్పింది. దీంతో ఇప్పటివరకు ఆ దేశంలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. బాధితుల రక్త నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
Singapore health ministry says reinfection with Omicron