886 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : సోమవారం భారీ పతనం నుంచి మార్కెట్లు కోలుకుని మంచి లాభాలను నమోదు చేశాయి. మంగళవారం బుల్ ర్యాలీ కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 886 పాయింట్ల లాభంతో 57,633 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 267 పాయింట్లు పెరిగి 17,169 వద్ద స్థిరపడింది. దీంతో బిఎస్ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.54 లక్షల కోట్లు పెరిగి రూ.260.27 లక్షల కోట్లకు చేరింది. సోమవారం లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.256.73 లక్షల కోట్లుగా ఉంది. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 378 పాయింట్లు పెరిగి 57,125 వద్ద కనిపించింది. ఓ దశలో 57,905 గరిష్ఠ స్థాయిని, 56,992 పాయింట్ల కనిష్ట స్థాయిని చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 29 లాభాలతో ముగిశాయి. ఏషియన్ పెయింట్స్ మాత్రమే నష్టపోయింది. టాటా స్టీల్ 4 శాతం లాభంతో ముగిసింది. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ సహా అన్ని బ్యాంకులు 1 నుంచి 3 శాతం లాభపడ్డాయి. మొత్తం 3,394 కంపెనీల షేర్లలో 2,344 షేర్లు లాభాలతో ముగియగా, 937 షేర్లు నష్టపోయాయి.