లండన్: వచ్చే ఏడాది చైనా రాజధాని బీజింగ్ వేదికగా జరగాల్సిన వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్య బహిష్కరణ చేయాలన్న అగ్రరాజ్యం అమెరికా నిర్ణయానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) మద్దతు తెలిపింది. ఈ మేరకు ఐఓసి అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాజకీయ వేత్తలు, దౌత్యవేత్తలు వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా రాజకీయ నిర్ణయమని స్పష్టం చేశారు. అది ప్రభుత్వాల ఇష్టం. అంతర్జాతీయ ఒలిపింక్ కమిటీ అనుసరించే రాజకీయ విధానం ఆధారంగా అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఒలింపిక్ క్రీడల్లో అథ్లెట్లు పాల్గొనే అంశంపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకుంది. దానిని ఒలింపిక్ కమిటీ స్వాగతిస్తుందన్నారు. ఇక క్రీడలు, ఒలింపిక్స్ ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలనే తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో అందరూ ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు.
కాగా క్రీడలకు సంబంధించి ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని 193 దేశాలు ఆమోదించాయని ఆయన వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు బీజింగ్ వేదికగా నిలువనుంది. కాగా వీఘర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తున్న వైఖరితో వింటర్ ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. జింజియాంగ్ ప్రావిన్స్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికా నిర్ణయానికి పలు దేశాలు మద్దతుగా నిలిచాయి. ఇలాంటి స్థితిలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయ లేదా అనేది సందేహంగా తయారైంది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్రీడలను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.
IOC Supports US Decision on Winter Olympics 2022