న్యూఢిల్లీ : పునరుత్పత్తి సహాయ సాంకేతికత ( అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) ఆస్పత్రుల క్రమబద్ధీకరణ బిల్లు 2021 ను పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును లోక్‌సభ డిసెంబర్ 1న ఆమోదించగా, రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. అలాగే ఎగువ సభ సరోగసీ (రెగ్యులేషన్) బిల్లు 2020 ను కొన్ని సవరణలతో ఆమోదించింది. ప్రతిపాదించిన ఈ బిల్లును లోక్‌సభ ఇదివరకే ఆమోదించగా, రాజ్యసభ సెలిక్టు కమిటీ పరిశీలనకు పంపింది. ఇప్పుడది లోక్‌సభకు తిరిగి ఆమోదానికి వెళ్తుంది.
ఈ బిల్లులపై చర్చలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ మాట్లాడుతూ సెలెక్టు కమిటీ సిఫార్సుల్లో చాలావరకు సరోగసీ బిల్లులో చేర్చడమైందని చెప్పారు. సరోగసీ తల్లులను అనైతికంగా వినియోగించడం, పుట్టబోయే బిడ్డల లింగ నిర్ధారణ తదితర అనైతిక కార్యకలాపాలకు ఈబిల్లుల వల్ల అడ్డుకట్ట పడుతుందని మంత్రి వివరించారు. ఇందులో నిర్దేశించిన నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా పడుతుందని చెప్పారు. బిడ్డలకు జన్మనిచ్చే సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి వారికి తగిన గౌరవం కల్పించాలన్నదే ఈ బిల్లుల లక్ష్యమని మంత్రి మాండవీయ పేర్కొన్నారు.