లండన్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను సమర్ధంగా అణచివేసే సరికొత్త యాంటీబాడీ చికిత్స అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ గ్లాక్సోస్మిత్ క్లైన్ (జిఎస్‌కె) దీన్ని అభివృద్ది చేసింది. ఒమిక్రాన్ లోని మొత్తం 37 మ్యూటెంట్లను సమర్ధంగా అణచివేసేలా సొట్రోవిమాబ్ అనే ఔషధాన్ని రూపొందించింది. ప్రయోగశాలలో ఒమిక్రాన్‌ను పోలిన వైరస్‌పై ఈ మందును ప్రయోగించగా, అన్ని మ్యుటేషన్లను సమర్ధంగా అణచివేసినట్టు తయారీ సంస్థ తాజాగా ప్రకటించింది. అన్ని వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే గుణమున్న ఈ ఒమిక్రాన్ కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ వ్యాపిస్తోంది. ప్రస్తుత చికిత్సలకు ఇది లొంగక పోవచ్చని, మరోసారి కొవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో న్యూయార్క్‌కు చెందిన వీర్ బయో టెక్నాలజీ సంస్థతో కలిసి జీఎస్‌కే సంస్థ సోట్రోవిమాబ్‌ను తీసుకువచ్చింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న కొందరు కొవిడ్ బాధితులకు సోట్రోవిమాబ్‌ను ఇచ్చామని, వారిలో ఆస్పత్రిలో చేరాల్సిన తీవ్ర అనారోగ్య పరిస్థితులు, మరణ ముప్పు 79 శాతం తప్పాయని వీర్ బయోటెక్నాలజీ సీఈవొ జార్జి స్కాన్గోస్ వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ఈ ఔషధానికి అనుమతులు మంజూరు చేసింది. బాధితుల్లో లక్షణాలు ప్రారంభమైన ఐదు రోజుల్లోనే దీన్ని అందించాలని సూచించింది. వివిధ దేశాలకు 7,50,000 డోసుల సొట్రోవిమాబ్ ఔషధం అందించేందుకు గ్లాక్సోస్మిత్ క్లైన్ ఒప్పందం చేసుకొంది.
UK Scientist found vaccine against Omicron