కోయంబత్తూర్/భోపాల్: వాయుసేన హెలికాప్టర్ దుర్ఘటనలో బతికిబయట పడిన ఒకే వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. తమిళనాడులోని నీల్‌గిరిస్ జిల్లాలోని వెల్లింగ్టన్ హాస్పిటల్ ఆయనను అడ్మిట్ చేశారు. వెల్లింగ్టన్ సైనిక ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న అతడిని మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి క్లిష్టంగానే ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఆయన తండ్రి, అధికార వర్గాలు గురువారం తెలిపాయి. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ తండ్రి కల్నల్ కెపి సింగ్ (రిటైర్డ్) భోపాల్‌లో ఉంటున్నారు. ఆయన ఫోన్ ద్వారా “నేను వెల్లింగ్టన్ చేరుకున్నాను. వరుణ్ సింగ్‌ను బెంగళూరుకు తరలిస్తున్నారు” అని తెలిపారు. ఆయన కుమారుడి పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించినప్పుడు “ దాని గురించి నేనేమి చెప్పలేను.ఏదీ ఖచ్చితంగా నాకు తెలియదు” అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఎయిర్పోర్ట్ రోడ్డులోని సన్ సిటీలో కల్నల్ కెపి సింగ్ పొరుగున ఉండే లెఫ్టినెంట్ కల్నల్ ఇషాన్ ఆర్(రిటైర్డ్) “నాకైతే విశ్వాసం ఉంది. అతడు గాయాల నుంచి కోలుకుంటాడు” అన్నారు. ప్రస్తుతం కల్నల్ కెపి సింగ్, ఆయన భార్య ఉమా ముంబయిలో తమ చిన్న కొడుకు తనూజ్ వద్ద ఉంటున్నారు. తనూజ్ నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. “ఇదివరలో తేజాస్ విమానం నడిపేప్పుడు కూడా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ జీవన్మరణ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు” అని ఆయన గుర్తుచేశారు. ఆయన సాహసానికి ఈ ఏడాది ‘శౌర్య చక్ర’ కూడా ప్రదానం చేశారు. ఇదిలావుండగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెలికాప్టర్ దుర్ఘటనపై దర్యాప్తు జరిపేందుకు ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నైతృత్వంలో ట్రైసర్వీసెస్ విచారణ జరుపుతున్నామని గురువారం పార్లమెంటులో తెలిపారు.