ప్రపంచవ్యాప్తంగా ఉచిత కొవిడ్ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: కొవిడ్19 వ్యాక్సిన్ ప్రపంచంగా ఉచితంగా అందించాలన్న విధానానికి కట్టుబడి భారత్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ శుక్రవారం తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్వహించిన ‘మానవ హక్కుల దినోత్సవం’ ఈవెంట్‌లో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. చరిత్రలోనే అత్యంత ఘోరమైన మహమ్మారి మానవాళిని నేడు పట్టిపీడిస్తోందని ఆయన అన్నారు. “మహమ్మారి ఏమీ ముగియలేదు, మానవాళికన్నా వైరస్ ఒకడుగు ముందే ఉంది. మనకున్న శాస్తవిజ్ఞానం, ప్రపంచ భాగస్వామ్యంను ప్రపంచం నేడు విశ్వసిస్తోంది”అని తెలిపారాయన. భారత్ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కోటికి పైగా ప్రజలను అందరికీ ఉచిత వ్యాక్సిన్ అందివ్వడం వల్ల కాపాడగలిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇతర కరోనా వారియర్స్‌ను ప్రశంసించారు. ఈ ఏడాది మానవ హక్కుల దినోత్సవ థీమ్ ‘సమానత్వం’ అన్నారు. మానవ హక్కులకు సమానత్వం ఆత్మ వంటిదని ఆయన అభివర్ణించారు. ప్రపంచం నేడు ఆరోగ్యకర పర్యావరణం, వాతావరణ మార్పు గురించి చర్చించాల్సి ఉందన్నారు.