మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: హెచ్‌ఎండిఏ పరిధిలోని ఆక్రమణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలక శాఖ (ఎంఏయూడి) ఆదేశాలు జారీ చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా అపార్ట్‌మెంట్‌లు, లే ఔట్లను చేసినట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. అయితే వీటికి గతంలో పంచాయతీలు అనుమతులు ఇచ్చినట్లు ఆయా అపార్ట్‌మెంట్‌లు, లే ఔట్ల యజమాన్యాలు చెబుతున్నారని, గతంలో పంచాయతీలకు రెండతస్తుల వరకే హెచ్‌ఎండిఏ అనుమతులు ఇచ్చినట్టు ఎంఏయూడి గుర్తించింది.
ప్రస్తుతం చాలా భవనాలకు రెండతస్తుల వరకే అనుమతులు ఉన్నాయని, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు అనుమతులు లేవని పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్‌లకు ఇచ్చిన మెమోలో స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏ పరిధిలోని నిర్మాణాలను పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్లను ఎంఏయూడి ఆదేశించింది. అదే సమయంలో అనుమతులు లేని నిర్మాణాలు కూల్చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ కమిషనర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆక్రమణలపై తీసుకున్న చర్యల నివేదికను ఈ నెలాఖరులోపు సమర్పించాలని, నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులపై చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు.