హైదరాబాద్: రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక శాఖ అనేక ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం రవీంద్రభారతిలో దేవరకొండ కోట పై రూపొందించిన ఫోటో ఎగ్జిబిషన్ ను దేవరకొండ శాసనసభ్యులు రవీంద్రకుమార్‌తో కలిసి ఆవిష్కరించారు. అదే విధంగా డాక్యుమెంటరీ దర్శకుడు దూలం సత్యనారాయణ మేడారం, జోడేఘాట్, సోమశిల – నల్లమల్ల ఫారెస్టులోని పర్యాటక ప్రదేశాలపై రూపొందించిన టూరిజం ప్రచార వీడియోలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగామంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి కోసం సిఎం కెసిఆర్ అనేక చర్యలు చేపట్టారన్నారు.
కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో గుర్తింపు లభించేలా కృషి చేశారన్నారు. వరల్ టూరిజం ఆర్గనైజేషన్ భూదాన్ పోచంపల్లి గ్రామాన్ని బెస్ట్ టూరిజం విల్లేజ్ గా గుర్తింపు లభించిందన్నారు. దేవరకొండ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రూ. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభి ంచామన్నారు. తెలంగాణ రాష్ట్రం లో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ప్రదర్శన నిర్వాహకులు యూనిస్ పర్హాన్, తదితరులు పాల్గొన్నారు.