న్యూఢిల్లీ : ఇప్పటి నుంచి మరో రెండేళ్లలో మొట్టమొదటి స్వదేశీ తయారీ ‘హెవీ లిఫ్ట్ ’ డ్రోన్లు ఈ కామర్స్ రవాణా కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. ఇవి 150 కిమీ దూరం వరకు 150 కిలోగ్రాముల బరువున్న సరకును 8 నుంచి 12 గంటల్లోగా మోసుకెళ్ల గలవు. ప్రస్తుతం ఇంతబరువు ప్యాకేజిని తీసుకెళ్లడానికి 72 గంటలు పడుతోంది. బెంగళూరు కేంద్రంగా ఉన్న అంకుర పరిశ్రమ న్యూస్పేస్ రీసెర్చి అండ్ టెక్నాలజీస్ విమాన రవాణా సంస్థ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో రూపకల్పన చేసిన ఈ డ్రోన్లను హెచ్‌ఎల్ 150 గా పిలుస్తారని న్యూస్‌స్పేస్ సిఇఒ సమీర్ జోషి చెప్పారు. గంటకు 100 కిమీ వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్లు వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ, హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లోనూ సులువుగా వెళ్ల గలవు. కృత్రిమ మేథో పరిజ్ఞాన అత్యంత ఆధునిక సాంకేతికతతో స్వయం సిద్ధంగా ఇవి కార్యకలాపాలు సాగించగలవు. టేకాప్, లాండింగ్, నేవిగేషన్, కార్గో డెలివరీ ఇవన్నీ తమకు తామే స్వయం సిద్ధంగా నిర్వహిస్తాయి.