Saturday, November 23, 2024

మతం-మతతత్వం!

- Advertisement -
- Advertisement -

PM Modi takes part in Ganga Aarti in Varanasiప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో అట్టహాసంగా గంగా హారతి కార్యక్రమం చేపట్టి యుపి ఎన్నికలకు ముందు హిందూ ఓటర్లను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయడానికి ఒక రోజు ముందు మొన్న ఆదివారం నాడు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఏర్పాటు చేసిన మహా బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ పాలనపై పదునైన బాణాలు సంధించారు. అధిక ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, రైతుల వెతలు వంటి ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి బిజెపి దేశాన్ని నాశనం చేస్తున్నదన్నారు. నడి బజార్లో పెట్టి అమ్మేస్తున్నదన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ నిర్మించిన దాన్ని ఏడేళ్లలో కూల్చి వేసిందని చెరిగి వదిలిపెట్టారు. దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల వాతావరణం ఇప్పుడే ఆవిష్కృతమైపోయింది. త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా వంటి రాష్ట్రాల ఎన్నికలు దేశ ప్రజల నాడిని స్పష్టం చేయనున్నాయి. ముఖ్యంగా 403 శాసన సభ స్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు బిజెపి కేంద్రంలో తిరిగి అధికారం సంపాదించుకొని హ్యాట్రిక్ సాధించడానికి కీలకం కానున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఫిబ్రవరి మార్చి లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గత నవంబర్ 25 నుంచి ఈ నెల 1 వరకు గల వారం రోజుల్లో ఆనంద బజార్ పత్రిక సి ఓటర్ జరిపిన సర్వేలో యుపిలో బిజెపిదే పై చేయిగా వున్నట్టు తేలింది. 41 శాతం ఓట్ల వాటాతో బిజెపి అగ్రభాగాన వుంది. అయితే 33 శాతం ఓట్లతో సమాజ్‌వాదీ పార్టీ దాని దరిదాపులకు చేరుకోడానికి యత్నిస్తున్నది. 13 శాతం ఓట్లతో బిఎస్‌పి, 8 శాతంతో కాంగ్రెస్, 5 శాతంతో ఇతరులు బాగా వెనుకబడిపోయి వున్నట్టు ఈ సర్వే వెల్లడించింది. ఇది బిజెపికి శుభ సూచకమే అయినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ దానికి అతి పెద్ద సవాలుగా వున్న సంగతి, ఆ పార్టీకున్న సామాజిక న్యాయ కోణం, బిసిల జన గణనకు మోడీ ప్రభుత్వం అంగీకరించకపోడం పరంగా, రైతు ఉద్యమ నేపథ్యం బిజెపిని యుపిలో అంతిమంగా పరాజయం పాలు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇది గ్రహించిన కేంద్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం ఇటీవల ఆదరాబాదరాగా వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అందుచేత దానిని ఓటమి భయం వెన్నాడుతున్నదని బోధపడుతున్నది. హిందుత్వ, పాకిస్తాన్ వ్యతిరేకత వంటి తనకు అచ్చి వచ్చిన శక్తులను గరిష్ఠ స్థాయికి రెచ్చగొట్టడమొక్కటే వచ్చే ఎన్నికల్లో తనను ఒడ్డున పడేయగలవని బిజెపి భావిస్తున్నది. గంగా హారతి వంటి సన్నివేశాలను అందుకే అసాధారణ స్థాయిలో రక్తికట్టిస్తున్నదనే అభిప్రాయం కలగడం సహజం.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ జైపూర్ సభలో బిజపి పట్ల హిందూ ఓటర్ల ఆలోచనను మార్చే ప్రయత్నం గట్టిగా చేశారు. హిందు, హిందుత్వ ఒకటి కావని ఆ రెండింటి మధ్య గట్టి విభజన రేఖ వుందని అన్నారు. మహాత్మా గాంధీ హిందువని, గాడ్సే హిందుత్వవాది అని వివరించారు. హిందువులది సత్యాన్వేషణ మార్గమని హిందుత్వవాదులది అధికారాన్ని హస్తగతం చేసుకోడమే లక్ష్యమని వివరించారు. దేశాన్ని పీడిస్తున్న ద్రవ్యోల్బణం, అధిక ధరలు హిందుత్వవాదులు సృష్టించినవేనని అభిప్రాయపడ్డారు. ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ హిందుత్వవాది కాబట్టే రైతులను మోసం చేశారని అన్నారు. హిందుత్వను రెచ్చగొట్టి ప్రయోగించి చేజిక్కించుకున్న అధికారాన్ని ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికే బిజెపి పాలకులు ఉపయోగిస్తున్నారన్నదే రాహుల్ గాంధీ ఆంతర్యంగా తెలుస్తున్నది. దానిని కొట్టిపారేయడానికి వీల్లేదు.

దశాబ్దాల గతంలోకి వెళ్లి చూస్తే హిందువుల్లో మతపరమైన సమరశీల ధోరణులు అంతగా కనిపించవు. అప్పట్లో ప్రశాంత సాగరంగా తలపించిన మెజారిటీ హిందూ సమాజాన్ని కల్లోల సముద్రంగా మార్చివేసిన కీర్తి హిందుత్వవాదులకే చెందుతుంది. గతాన్ని తవ్వి మైనారిటీలను లక్షంగా చేసుకొని మెజారిటీ ప్రజలైన హిందువుల్లోని మతపరమైన అంకిత భావాన్ని, భక్తిని ఉన్మాద స్థాయికి తీసుకు వెళ్లి దానిని అనుకూల ఓటుగా మలచుకొని అధికారాన్ని చేజిక్కించుకోడం ఆ దారిలో అల్పసంఖ్యాకులపై దాడులకు పురిగొల్పి, సెక్యులర్ మేధావులను కూడా వదలకపోడం ఇవన్నీ హిందుత్వ లక్షణాలే కాని హిందూ గుణాలు కావని రాహుల్ గాంధీ విడమరచి చెప్పారు. ఆ విధంగా బిజెపి ఓటు మూలాలపై సునిశితమైన అస్త్రాన్ని సంధించారు. అధికారాన్ని దేశ ప్రజల కోసం ఉపయోగించకుండా వారిని కార్పొరేట్ గద్దలకు ఆహారంగా వేయడానికి వాడుకుంటున్నారనే వాదన కాదనలేనిది. ఇదే కాంగ్రెస్‌కు, ఇతర ప్రతిపక్షాలకు అమరిన ఆయుధమవుతున్నది. హిందుత్వకు ప్రజల సమసలకు ముడిపెట్టిన రాహుల్ గాంధీ ప్రసంగం దేశ ప్రజల్లో చర్చకు దారి తీస్తుందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News