ముంబయి: క్రూయిజ్‌షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ప్రతి శుక్రవారం ముంబయిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) కార్యాలయంలో హాజరు కావాలన్న షరతు నుంచి ఆర్యన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తును ఢిల్లీలోని ఎన్‌సిబికి చెందిన సిట్ చేపట్టినందున ముంబయిలోని ఎన్‌సిబి కార్యాలయానికి హాజరు కావడంపై మినహాయింపు కోరుతూ ఆర్యన్ పెట్టుకున్న పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టులోని జస్టిస్ ఎన్‌డబ్లూ సాంబ్రే ఏకసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఢిల్లీలోని ఎన్‌సిబి కార్యాలయానికి హాజరు కావాలని అధికారులు సమన్లు పంపినపుడు హాజరు కావాలని ఆర్యన్‌కు సూచించారు.
హాజరయ్యేందుకు ఆర్యన్‌కు 72 గంటల సమయమివ్వాలని ఎన్‌సిబికి ధర్మాసనం సూచించింది. మరో షరతును కూడా హైకోర్టు సడలించింది. ఎన్‌సిబి ముందు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళితే ఆ సమాచారాన్ని ముందే ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇతర ప్రాంతాలకు వెళితే తెలియజేయాలని స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్‌కు బాంబే హైకోర్టు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 14మందిపై దర్యాప్తు జరుగుతోంది.