Friday, November 22, 2024

కాంగ్రెస్ గూటికి డిఎస్.. హైకమాండ్ మంతనాలు…

- Advertisement -
- Advertisement -

D Srinivasa will joined in Congress

మన తెలంగాణ/హైదరాబాద్: ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఓ వైపు పార్టీలో జోష్.. శ్రేణుల్లో ఉత్సాహం నింపడం తో పాటు.. మరో వైపు పార్టీని వీడిన ప్రముఖులను కలుస్తూ వారిని తిరిగి పార్టీలోకి తెచ్చే విధంగా టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన కసరత్తు మంచి ఫలితాలను ఇస్తోంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిఎస్ పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీని అధికారంలోకి తేవడంలో కీలకపాత్ర వహించారు. డిఎస్ పార్టీలో చేరితే పార్టీ మరింత బలోపేతం కాగలదని రేవంత్‌తో పాటు హైకమాండ్ భావిస్తోంది. త్వరలో డిఎస్ రాజ్యసభ పదవీకాలం ముగియ నుంది.

ఈ క్రమంలో డిఎస్‌తో హైకమాండ్ మంతనాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత చేకూరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, టిపిసిసి చీఫ్‌గా డి.శ్రీనివాస్ పనిచేశారు. 2004లో డి.శ్రీనివాస్ పిసిసి చీఫ్‌గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టిఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో తనను ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డిఎస్ ఆరోపించారు. అదే సమయంలో టిఆర్‌ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన టిఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఆ తర్వాత టిఆర్‌ఎస్‌కు చెందిన నిజామాబాద్ జిల్లా నేతలు డి.శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సిఎం కెసిఆర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అయన అప్పట్నించీ టిఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. టిఆర్‌ఎస్ ఎంపి పదవికి డిఎస్ రాజీనామా చేయలేదు. కాగా, గత కొంతకాలంగా డిఎస్ పార్టీని వీడుతారని, కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బిజెపిలో చేరుతారనే ప్రచారం సైతం కొనసాగింది. డిఎస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపి స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఈ గెలుపులో డి.శ్రీనివాస్ కీలకంగా వ్యవహరించారని అంటూ వుంటారు.

ఈ క్రమంలో అటు కాంగ్రెస్.. ఇటు బిజెపి అన్న డోలాయమాన స్థితి నుంచి రేవంత్ చొరవతో డిఎస్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. హైకమాండ్ సైతం డిఎస్ లాంటి వ్యక్తులు పార్టీలో రావడం వల్ల మేలు జరుగుతుందని భావించింది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది. కాగా, పార్టీ పెద్దల సమక్షంలో డిఎస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. సీనియర్ నేతల ఆవశ్యకతను గుర్తించిన హైకమాండ్.. ఆ దిశగానే టిపిసిసి చీఫ్ రేవంత్ వెళుతుండటంపై సైతం సంతృప్తిని వ్యక్తపర్చినట్లు తెలుస్తోంది. దీంతో డిఎస్‌తో పాటు మిగతా కాంగ్రెస్ పాత కాపులు సైతం తిరిగి పార్టీలో చేరే అవకాశం మెండుగా ఉండవచ్చని ఇటు రేవంత్‌తో పాటు అటు హైకమాండ్ విశ్వసిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News