సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సోమశిల, నల్లమల్ల ఫారెస్టులోని పర్యాటక ప్రదేశాలపై రూపొందించిన టూరిజం ప్రచార వీడియోను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల పట్ల నిర్లక్ష్యం వహించారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తీసుకున్న చర్యలతో కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకుల సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, స్పోర్ట్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కేశవులు, తదితరులు పాల్గొన్నారు.