అన్ని మౌలిక వసతులతో పరిశుభ్ర పట్టణాలను అభివృద్ధి చేయాలనే లక్షంతో ప్రభుత్వం ముందుకెళుతోంది
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాల
అభివృద్ధికి సకల చర్యలు తీసుకుంటుంది పట్టణ ప్రగతి
కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి 142 పట్టణాలకు
రూ.3041కోట్లు విడుదల చేశాం ప్రతి మనిషి అవసరాన్ని
ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంటుంది సఫాయన్నా నీకు
సలాం అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి ప్రతి నెల
మొదటివారంలోనే జీతాలు ఇప్పిస్తున్నారు, వారి జీతాలు
రూ.12వేలకు పెంచారు పరిశుభ్రంగా ఉంచే విధంగా
వారిని ఉత్తేజపరిచి పనిచేయిస్తున్నారు : సంగారెడ్డి బైపాస్
రోడ్డులో సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ భవన
సముదాయానికి శంకుస్థాపన చేస్తూ మంత్రి కెటిఆర్ వెల్లడి
మన తెలంగాణ/ సంగారెడ్డి : పట్టణాలను అన్ని మౌలిక వసతులతో పరిశుభ్ర పట్టణాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తోందని రాష్ట్ర మున్సిపల్, ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణం లోని బైపాస్ రోడ్డులో రూ.6.70 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాల అభివృద్ధి కి అన్ని విధాల చర్యలు తీసుకుంటోందన్నారు. అన్ని పట్టణాలలో మంచి వసతులు ఉండాలనే ఉద్దేశంతో సంగారెడ్డి పట్టణం మధ్యలో రెండెకరాల స్థలంలో రూ.6.70 కోట్ల నిధులతో సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన సముదాయంకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. త్వరితగతిన పూర్తిచేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో రూ. 500 కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి 142 పట్టణాలకు రూ .3041 కోట్లు విడుదల చేశామన్నారు.
ఒక మనిషికి ఏం కావాలన్నది ప్రభుత్వం ఆలోచించి చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తో పరిశుభ్రతతో పాటు అభివృద్ధి కనిపిస్తుంద న్నారు. గతంలో మున్సిపాలిటీ లో పనిచేసే సఫాయి కార్మికులకు మూడు నాలుగు నెలల వరకు జీతాలు రాని పరిస్థితి ఉండేదనీ , తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ‘సఫాయన్న నీకు సలాం అన్న‘ ముఖ్యమంత్రి ప్రతినెల మొదటివారంలోనే వారికి జీతాలు ఇస్తున్నారన్నారు. వారి జీతాలను రూ. 12 వేలకు పెంచారని గుర్తు చేశారు. సలామ్ కొట్టడమే కాకుండా పట్టణాలు పల్లెలు పరిశుభ్రంగా ఉంచే విధంగా వారిని ఉత్తేజపరిచి పనిచేయిస్తున్నారని అన్నారు.ప్రతినెల మొదటి వారంలో సంగారెడ్డి పట్టణానికి రూ. 15 కోట్ల 31 లక్షలు, సదాశివపేట పట్టణానికి రూ. 7.95 కోట్లు, జహీరాబాద్ కు రూ.16.09 కోట్లు నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. వారం పది రోజుల్లో సంగారెడ్డి,సదాశివపేట మున్సిపాలిటీలకు రూ. 50 కోట్ల నిధులను విడుదల చేస్తామని తెలిపారు.కొత్త పంచాయతీ రాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టంను తెచ్చామని, అందులో 10 శాతం బడ్జెట్ ను గ్రీన్ బడ్జెట్ గా పెట్టి చెట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి వ్యక్తికి చనిపోయిన తర్వాత అంతిమయాత్ర గౌరవంగా జరిగేలా వైకుంఠ రథాలు,ఆఖరి సఫర్ పేరిట ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. సిఎం కెసిఆర్ సంగారెడ్డిలో రూ.550 కోట్ల నిధులతో మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ను మంజూరు చేశారన్నారు. రాబోయే సంవత్సరం కళాశాల అందుబాటులోకి వస్తుందన్నారు. పేదవారు ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో ఆక్రమణలో ఉన్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 58, 59 తెచ్చి ఉచితంగా క్రమబద్ధీకరణ చేశామని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో పేదవారు ఉన్నట్లయితే క్రమబద్దీకరించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. స్థానిక శాసన సభ్యులు జయప్రకాశ్ రెడ్డి ఇచ్చిన అన్ని విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. మెట్రో రైల్ సంగారెడ్డి వరకు వచ్చేలా భవిష్యత్తులో సానుకూలం అయ్యేలా చూస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు.
అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో గ్రాన్యూల్స్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాకు అందజేసిన వై కుం ఠ రథం లు, ఆఖరి సఫర్ వాహనాలను మంత్రి జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్, సంగారెడ్డి శాసనసభ్యులు , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, సంగారెడ్డి సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ లు, వైస్ చైర్పర్సన్ లు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్ పి రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్పీటీసీలు ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
మావోళ్లని బాగా చూసుకో అన్నా
కెటిఆర్-జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ
సంగారెడ్డి కలెక్టరేట్‌లో మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తమ ఎంపిలు, ఎంఎల్‌ఎలను జాగ్రత్తగా చూసుకో జగ్గన్న అంటూ కెటిఆర్ పలకరించారు. అయితే మీరే తమను చూసుకోవాలంటూ జగ్గారెడ్డి సమాధానం ఇచ్చారు. గురువారం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం చుట్టారు. పురపాలక ఐటి శాఖ మంత్రి కెటిఆర్,స్థానికంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌కు రూ.6 కోట్ల ఏడు లక్షల నిధులతో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కోసం అధికారిక కార్యక్రమాలలో జగ్గారెడ్డి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం సంగారెడ్డి సదాశివపేట మునిసిపాలిటీలో ఉన్న నిరుపేదలు ఐదు వేల మందికి ఇండ్ల స్థలాలు, డ్వాక్రా మహిళల భవనాలకు నిధులు, రంగారెడ్డి నియోజకవర్గానికి 996 కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా కెటిఆర్‌ను ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి కోరారు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.