Saturday, November 16, 2024

అమ్మాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు

- Advertisement -
- Advertisement -

Minimum age of marriage for girls is 21 years

చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ: అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమ్మాయిలకు 18 ఏళ్లు నిండితేనే పెళ్లి చేయాలని చట్టం ఉండగా.. ఆ కనీస వయసును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం తాజాగా బుధవారం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అబ్బాయిలు, అమ్మాయిల వివాహ వయసుల్లో అంతరాన్ని తొలగించడం కోసం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు బాల్య వివాహాల నిరోధక చట్టం 2006కు సవరణ తీసుకు రావడానికి ఒక బిల్లును ప్రభుత్వం ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే గత కొంత కాలంగా దేశంలో దీనిపై చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరాన్ని తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

అమ్మాయిల వివాహ వయసు తక్కువగా ఉండడం వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి. అంతేకాకుండా చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని పలువురు కోరుతున్నారు. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంది. ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపంనుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ తెలిపారు. దీనికోసం గత ఏడాది జూన్‌లోనే నీతి ఆయోగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దీనికి జయా జైట్లీ నేతృత్వం వహించగా, ప్రభుత్వ నిపుణుల డాక్టర్ వికె పాల్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు కూడా దీనిలో సభ్యులుగా ఉన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నిటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు తొలిసారి గర్భం దాల్చే సమయానికి వారి వయసు కనీసం 21 ఏళ్లు ఉండాలని సూచించింది.

అంతేకాకుండా అమ్మాయిలకు 21 ఏళ్లకు వివాహం చేయడం ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా సానుకూల ప్రభావం చూపిస్తుందని టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. గత డిసెంబర్‌లో టాస్క్‌ఫోర్స్ ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించింది. ఈ ప్రతిపాదనలకు తాజాగా కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకు అనుగుణంగా త్వరలోనే బాల్య వివాహాల నిరోధర చట్టం, ప్రత్యేక వివాహ చట్టం,హిందూ వివాహ చట్టాల్లో సవరణలు తీసుకు రావాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జయాజైట్లీ పిటిఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ సిఫార్సులు చేశామన్నారు. నిపుణులు, యువత మరీ ముఖ్యంగా యువతులను సంప్రదించి ఈ నివేదికను సంప్రదించామన్నారు. జనాభా నియంత్రణ కోసం తాము ఈ సిఫార్సులు చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చేప్తున్నామన్నారు. సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, జనాభా నియంత్రణలోనే ఉందని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించిందని చెప్పారు. మహిళలను సాధికారులను చేయడమే తమ సిఫార్సుల ఉద్దేశమని సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలయిన జయాజైట్లీ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News