చార్జీల పెంపువల్ల సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం
వచ్చిన ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేస్తాం
ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
హైదరాబాద్: మరో వారంలో ఆర్టీసి బస్సు చార్జీలు పెరగనున్నాయని సంస్థ ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టతనిచ్చారు. దీంతోపాటు ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేదని ఆయన తెలిపారు. బస్‌భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆర్టీసి చార్జీల పెంపు అనివార్యమని, ఇప్పటికే చార్జీల పెంపు విషయంపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కి రెండుసార్లు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో వచ్చే వారంలో చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. పల్లె వెలుగు సర్వీసులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్, ఆపై సర్వీసులకు కిలోమీటర్‌కి రూ.30 పైసలు పెరుగుతాయన్నారు. ఆర్టీసి ధరల పెంపుతో ఆదాయం పెరుగుతుందని బాజిరెడ్డి పేర్కొన్నారు. చార్జీల పెంపువల్ల సుమారు రూ.700 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశముం దన్నారు. వచ్చిన ఆదాయంతో కొత్త బస్సులు కొనుగోలు చేయాలని యోచిస్తున్నామన్నారు. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆయన తెలిపారు.
యూనియన్లకు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదు
ఆర్టీసి యూనియన్ల ఎన్నికలపై చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూనియన్లకు ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని అది ఇప్పట్లో అది సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పేశారు. యూనియన్ల ఎన్నికలతో సమస్యలు వచ్చే అవకాముందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్టు బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఆర్టీసి గుర్తింపు యూనియన్ల ఎన్నికలు నిర్వహిస్తే గెలిచిన తర్వాత డిమాండ్లు పెడతారని, సమ్మె అంటారని ఆయన తెలిపారు. సమ్మె అంటే ఆర్టీసి మళ్లీ వెనక్కి వెళ్లే ప్రమాదముందని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికలు జరపలేమని ఆయన స్పష్టం చేశారు.