19 మంది మృతి.. అనేక దీవులు ధ్వంసం
మనీలా: ఫిలిప్పీన్స్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లోని అనేక ప్రావిన్సులపై విరుచుకుపడిన తుపాను ధాటికి 19 మంది మరణించగా కొన్ని దీవులలో ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. తన దీవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు దినగట్ ప్రావిన్సు గవర్నర్ అర్లీన్ బగ్ అవ్ సమాచారం అందించారు. దక్షిణ, సెంట్రల్ దీవులకు చెందిన ప్రావిన్సులలోని 3 లక్షల మందికి పైగా ప్రజలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పసిఫిక్ మహాసముద్రం, దక్షిణ చైనా సముద్రం మధ్య ఉన్న ఫిలిప్పీన్స్‌లోని అనేక ప్రావిన్సులలో తుపాను రాయ్ కారణంగా గంటకు 195 కిలోమీటర్ల ఉధృతితో గాలులు వీచాయి. అనేక ప్రావిన్సులలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టాలపై పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. 1.80 లక్షల మంది నివసించే తమ ప్రావిన్సులో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయని, తమకు ఆహారం, మంచినీరు, తాత్కాలిక షెల్టర్లు, ఇంధనం, హైజిన్ కిట్స్, వైద్య సరఫరాలు అత్యవసరంగా కావాలని అర్థిస్తూ దినగట్ ప్రావిన్సు గవర్నర్ అర్లీన్ బగ్ తమ అధికార వెబ్‌సైట్‌లో ప్రకటన పోస్ట్ చేశారు.