సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుందని, అందరూ పుస్తక పఠనంపై మక్కువ పెంచుకోవాలని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం, తెలంగాణ కళాభారతి వేదికగా 34వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, బిసి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలంగాణ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రవీంద్ర భారతిలో శాశ్వత బుక్ స్టాల్‌ను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ కూడా పుస్తకాభిమాని అని ఆయన తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ ఈ సారి 270 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ప్రతిరోజు లక్షకు పైగా పుస్తకాభిమానులు బుక్ ఫెయిర్‌ను సందర్శిస్తారని ఆయన పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా మంచి ఆలోచనా, వివేకం వస్తుందని, ప్రశాంతంగా ఉండేందుకు పుస్తకాలు ఎంతగానో ఉపయోగప డతాయన్నారు. బిసి వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ పుస్తక ప్రియులకు ఇది పెద్ద పండుగని, పుస్తకాన్ని ప్రేమించే వ్యక్తి ఎవరినీ ద్వేషించడని, ప్రపంచ స్థాయిలో జరిగే బుక్ ఫెయిర్‌లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కూడా ప్రముఖ స్థానం సంపాదించిందని ఆయన తెలిపారు.