అమేథీ / న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లోని తన ఇదివరకటి నియోజక వర్గమైన అమేథీలో శనివారం ర్యాలీలో కేంద్రంపై తిరుగులేని దాడి చేశారు. అమేథీలో ఆయన ద్రవ్యోల్బణ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ యుపి ఇన్‌ఛార్జి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత రాహుల్ అమేథీలో పర్యటించడం ఇది రెండోసారి. అమేథీ లోని ప్రతివీధి ప్రతిప్రాంతం ఏమాత్రం ఎదుగూబొదుగూ లేకుండా ఇంకా అలాగే ఉన్నాయని ప్రజల కళ్లల్లో కోపం తప్ప మరేమీ కనిపించడం లేదని రాహుల్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఇదివరకు లాగానే ప్రజల హృదయాల్లో తమకు చోటు మిగిలి ఉందని, అన్యాయానికి వ్యతిరేకంగా తామంతా సమష్టి పోరాటం సాగిస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
2004 లో తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అమేథీ నగరం నుంచే మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశానని రాహుల్ వివరించారు. రాజకీయాల గురించి అమేథీ ప్రజలు తనకెన్నో నేర్పారని చెప్పారు. రాజకీయాలకు నాకు మార్గాన్ని చూపించిన మీలో ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని రాహుల్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చైనాతో భారత్ సరిహద్దు వివాదం, ఆందోళన ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు, హిందువుకు, హిందుత్వవాదానికి తేడాపై ఆయన బిజెపిపై ప్రశ్నలు గుప్పించారు. హిందువు తన మొత్తం జీవితమంతా సత్యమార్గం లోనే నడుస్తాడని, భయానికి లొంగకుండా అన్ని భయాలకు ఎదురొడ్డి నిలుస్తాడని, తన భయాన్ని కోపం, ద్వేషం కింద మార్చబోడని రాహుల్ పేర్కొన్నారు. హిందుత్వవాది మాత్రం అధికారంలో ఉండడానికి అబద్ధాలను అలవాటుగా చేసుకుంటాడని వ్యాఖ్యానించారు. సత్యాగ్రహం అన్నది హిందూ మార్గంగా మహాత్మాగాంధీ అభివర్ణించారని రాహుల్ ప్రస్తావించారు.