మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర
దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్బిటేషన్, మీడియేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తూ సిజెఐ ఎన్.వి.రమణ
ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగీకరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌలిక వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకు కృతజ్ఞతలు – సిజెఐ
భాగ్యనగరాన్ని అధికంగా ప్రేమించే వ్యక్తి సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ. ఐఎఎంసి ఏర్పాటులో కీలక పాత్ర వహించారు.
-ముఖ్యమంత్రి కెసిఆర్
తెలుగు నేలలో గొప్ప చారిత్రక కట్టడం రామప్ప
సిజెఐ ఎన్.వి.రమణ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఎఎంసి కీలకపాత్ర వహిస్తుందని సిజెఐ ఎన్‌వి రమణ పేర్కొన్నారు. హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని ఫొనిక్స్ వికె టవర్లో శనివారం నాడు ఏర్పాటు చేసిన ఐఎఎంసి కేంద్రాన్ని సిఎం కెసిఆర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈక్రమంలో ఐఎఎంసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ఐఎఎంసి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ మాట్లాడుతూ దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమని, తాను అడగగానే అన్ని విధాల సహకరించిన సిఎంకు, అద్భుతమైన మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలన్నారు. ఐఎఎంసి ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగకీరించిన సిఎం కెసిఆర్ తక్కువ కాలంలో మంచి మౌళాక వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఐఎఎంసి సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దీనికోసం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టమన్న సిజెఐ ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారమవుతాయని అన్నారు.
అతితక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యంగా ఆర్బిట్రేషన్, మీడియేషన్ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆర్బిట్రేషన్, మీడియేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యత ఉందని, ముఖ్యంగా ఉత్తర, దక్షిణ భారతానికి వారధిలాంటి హైదరాబాద్‌లోని ఐఎఎంసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా హైదరాబాద్ నగరం పురోగమిస్తోందని, ఈ నగరాన్ని ఈ స్థాయిలో నిలిపేందుకు చాలా మంది కృషి చేశారన్నారు. భాగ్యనగరాన్ని అధికంగా ప్రేమించే వ్యక్తి సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ అని ఐఎఎంసి ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. అనేక రంగాల్లో హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారుతోందని, ఐఎఎంసి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వివాదాలు ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవచ్చాని సిఎం తెలిపారు.
సిజెఐకి అప్పగింత
ఐఎఎంసి పూజ, ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్‌తో కలిసి జస్టిస్ ఎన్‌వి రమణ ఆ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఐఎఎంసి ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణకు ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పగించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
ఆరు నెలల్లో అన్ని ఏర్పాట్లు
ఈ ఏడాది జూన్ 14న హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ముఖ్యమంత్రి కెసిఆర్ వద్ద సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ ప్రతిపాదించారు. దీంతో సిఎం కెసిఆర్ వెంటనే అంగీకరించడంతో పాటు ఆరునెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన నానక్‌రామ్ గూడాలోని ఫొనిక్స్ వికె టవర్లో 25వేల చదరపు అడుగుల్లో ఈ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో – సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమాకోహ్లి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఆర్‌వి రవీంద్రన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.