మన తెలంగాణ/హైదరాబాద్ : గవర్నర్ కోటా ఎంఎల్‌సిగా ఎన్నికైన సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. ఎంఎల్‌సిగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్‌సిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మధుసూదనాచారి అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన మధుసూదనాచారి 199499 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ వెంటే ఉన్నారు. టిఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మధుసూదనాచారి ఒకరు. 2014 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నూతన రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.