వరసగా రెండో రోజూ 12 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు
12కు చేరిన మరణాలు
లండన్: ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. గత రెండేళ్లగా ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కొవిడ్ భయాలు తగ్గి ఇప్పుడిప్పుడే మామూలు పరిస్థితులు నెలకొంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో మళ్లీ ఈ మహమ్మారి తరుముతుండడం జనావళిని భయపెడుతోంది. ఇప్పటికే 89 దేశాలకు వ్యాపించిన ఈ కొత్త వేరియంట్ బ్రిటన్‌ను వణికిస్తోంది. వరసగా రెండో రోజు కూడా అక్కడ 12 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం కలవరపెడుతోంది. దేశంలోని మొత్త 82,886 కరోనా కేసులుండగా అందులో 37 వేలకు పైగా కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం. ఈ నెల 8న బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ప్రకటించిన ఆంక్షలు కొనసాగుతుండగానే తొలి ఒమిక్రాన్ మరణం అక్కడే నమోదు కావడం, తాజాగా ఆ సంఖ్య 12కు చేరుకోవడంతో క్రిస్మస్‌కన్నా ముందే మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. డెల్టారకం కన్నా ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు బ్రిటన్ ఈ నెల 8న పలు ఆంక్షలను ప్రకటించింది.
యుకె ప్రజలు ఇంటివద్దనుంచే పని చేయాలని ఆదేశించడంతో పాటుగా మాస్కులు ధరించడం, వ్యాక్సిన్ పాస్‌లు ఉపయోగించడం వంటి నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. తాజాగా అక్కడ కేసులు భారీగా పెరుగుతుండడం, 12 మంది దాకా మరణించడం, మరో 102 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తరుణంలో కఠిన ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారాలు జోరుగా సాగే క్రిస్మస్ సమయంలో ఇప్పటికే సిబ్బంది గైరుహాజరుతో వ్యాపార సంస్థలు వెలవెలబోతున్న తరుణంలో కఠిన ఆంక్షలకు జాన్సన్ మంత్రివర్గంలో చాలా మంది మంత్రులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారులు మాత్రం వైరస్‌ను కట్టడి చేయాలంటే కఠిన ఆంక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. క్రిస్మస్‌కు ముందే కఠిన ఆంక్షలను విధించే అవకాశాలను ఉపప్రధాని డొమెనిక్ రాబ్ కొట్టివేయకపోవడం గమనార్హం.