Saturday, November 23, 2024

సంపాదకీయం: ఒమిక్రాన్ ముప్పు!

- Advertisement -
- Advertisement -

covid 19 second wave in india నెమ్మదిగా ప్రవేశించి అతి వేగంగా వ్యాపిస్తున్న వొమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. కరోనా దాల్చిన మరో అవతారమై ప్రమాద గంటలు మోగిస్తున్నది. కరోనా రెండో అల సృష్టించిన అసాధారణ మారణకాండ నుంచి తేరుకొంటున్న దశలో, డెల్టా వేరియంట్ వెళ్ళిపోతున్నదనే ఆనందంలో ప్రజలు బేపర్వాగా తిరుగుతున్న సమయంలో అది తనది స్వల్ప విరామమేగాని పూర్తి విరమణ కాదని చాటుతున్నది. వొమిక్రాన్ రూపంలో అడుగుపెట్టి భీతావహాన్ని వ్యాపింప జేస్తోంది. గత నెల 24న దక్షిణాఫ్రికాలో మొదటి సారి బయటపడిన వొమిక్రాన్ అక్కడ, బ్రిటన్‌లో విస్తృతంగా వ్యాపిస్తున్నది. ఇది ఇప్పటికే దాదాపు వంద దేశాలకు పాకింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వొమిక్రాన్ వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

టీకా వేయించుకొన్న వారిలో, కరోనా నుంచి కోలుకొన్నవారిలో కూడా ప్రత్యక్షమవుతున్నదని స్పష్టం చేసింది. వొమిక్రాన్ పూర్వపు రకాల కరోనా కంటే తక్కువ ప్రమాదకరమైనదని మొదట్లో అనుకొన్నది వాస్తవం కాదని కూడా ఈ సంస్థ నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 56 లక్షల మందిని బలి తీసుకొన్న కరోనాకు 2022 లో పూర్తిగా తెరపడవచ్చునని అభిప్రాయపడుతున్నారు. అదేమైనప్పటికీ వొమిక్రాన్ వ్యాప్తి దేశ దేశాల్లోని వైద్య చికిత్స వ్యవస్థలకు మళ్ళీ అగ్నిపరీక్ష పెట్టనున్నదనే భయం వ్యక్తమవుతుండడం గమనించవలసిన అంశం. వైరస్ వ్యాప్తిని ఎంత తొందరగా అరికట్టగలమన్నదే అసలు సమస్య. దానిని సాధించగలిగితే వొమిక్రాన్‌ను సులభంగా జయించగలమని సూచిస్తున్నారు. సమూహాల్లోకి వెళ్లకుండా వుండడం, మాస్క్ ధరించడం, అందరూ టీకా వేయించుకొనేలా చూడడం అవసరం. కొన్ని దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోసులు వేస్తున్నారు. అలాగే టీకాల సామర్ధ్యం పెంపు మీద దృష్టి పెట్టాలి.

సంపన్న దేశాలు బూస్టర్ డోసులకు వెళ్లడం వల్ల టీకాల విషయంలో దేశాల మధ్య వ్యత్యాసం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి డోస్ టీకా కూడా వేసుకోని పేదలు అసంఖ్యాకంగా ఉన్నారని, ఈ పరిస్థితి కొనసాగినంత కాలం కరోనా పీడ వదలదని భావిస్తున్నారు. జనవరి నాటికి అమెరికాలో వొమిక్రాన్ బీభత్స నాట్యం తప్పదని అక్కడి వైద్యశాఖ హెచ్చరించింది. క్రిస్మస్ పండగ దినాల్లో జనం గుమిగూడడం, సమూహాలుగా ఏర్పడడం ప్రభావం తీవ్రంగా ఉండగలదని అభిప్రాయపడ్డారు. అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 73 శాతం వొమిక్రాన్‌విగా నిర్ధారణ అయింది. బ్రిటన్, యూరపులో కొత్త వైరస్ వ్యాప్తిని బట్టి అమెరికాలో సైతం వచ్చే వారాల్లో వొమిక్రాన్ అసాధారణంగా విజృంభించొచ్చునని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ తదితర కొన్ని ప్రాంతాల్లో గత వారం నమోదైన కేసుల్లో 90 శాతం వొమిక్రాన్ వైరస్‌వేనని, గత వొక్క వారంలోనే అమెరికాలో 6,50,000కు పైగా కరోనా నమోదయ్యాయని సమాచారం. బ్రిటన్‌లో వొమిక్రాన్ వల్ల ఇంతవరకు 12 మంది మరణించారు, ఇది ఆందోళనకరమైన పరిణామం.

క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధిస్తే ప్రజల్లో తిరుగుబాటు తప్పదని ప్రధాని బోరిస్ జాన్సన్ భయపడుతున్నారు. అమెరికాలో వొమిక్రాన్ ఇంతవరకు ఒకరిని బలి తీసుకొన్నది. సింగపూర్‌లో టీకా పూర్తిగా వేయించుకొన్న ముగ్గురికి కొవిడ్ శోకగా అందులో ఇద్దరిలో వొమిక్రాన్ బయటపడింది, అందుచేత ప్రస్తుత టీకాల వల్ల వొమిక్రాన్ ఆగదనే భయం అక్కడ వ్యక్తమవుతున్నది.

ప్రతి వొక్కరికీ వొమిక్రాన్ సోకే ప్రమాదముంది. పది మందిలో కలిసి తిరిగితే వొమిక్రాన్ తప్పక అక్కున చేర్చుకొంటుంది అని హెచ్చరిస్తున్నారు. టీకా వేయించుకోని వారికి తీవ్ర అస్వస్థత, మరణం తప్పవని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. టీకా వేసుకున్నవారిలోనూ వొమిక్రాన్ కనిపిస్తున్నప్పుడు వేయించుకోకపోతే ప్రమాదం అని గట్టిగా యెలా చెప్పగలరు? కొత్త వేరియంట్లను కూడా దృష్టిలో పెట్టుకొని సమర్ధవంతమయిన టీకాలను కనుక్కోవలసి వుంది. వొమిక్రాన్ పుట్టిన దేశమని చెప్పి దక్షిణాఫ్రికాకు విమాన రాకపోకలు పలు దేశాలు నిలిపివేయడాన్ని అక్కడి పాలకులు వ్యతిరేకస్తున్నారు. తాము టెస్టులు బాగా జరిపిస్తున్నామని, తమను ఆర్ధిక శిక్షలకు గురి చేయడం తగదని అంటున్నారు. దక్షిణఫ్రికా, బ్రిటన్, అమెరికాలతో పోలిస్తే ఇండియాలో కేసులు బాగా తక్కువే అయినప్పటికే వ్యాప్తి వేగంగానే ఉన్నట్టు బోధపడుతున్నది. దేశంలో ఇప్పటివరకు 200 వొమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా మహారాష్ట్ర, ఢిల్లీలలో చెరి 54 కేసులు రికార్డయ్యాయి. కర్ణాటకలో ముందు జాగ్రత్తగా నూతన సంవత్సర సామూహిక ఉత్సవాలను నిషేధించారు. ముంబై మున్సిపాలిటీ 200 మందికి మించి వొక చోట చేరరాదని ఆదేశించింది. కరోనా సంఘ జీవనంపై కత్తి ప్రయోగిస్తున్నది. ఏడాదిన్నరకు పైగా దేశంలో ఇదే పరిస్థితి, వొమిక్రాన్ మనవద్ద పరిమితమేననే ధీమాతో ఏమరుపాటు తగదు. అలాగని అతిగా స్పందించి జీవన, ఆర్ధిక వ్యవస్థలను అమితంగా స్తంభింపజేసుకోకూడదు. దేశ పాలకులు యీ విజ్ఞతను పాటించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News