బాధితురాలిని వేధించి డబ్బులు వసూలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన నలుగురు బాధితులు
హైదరాబాద్ : లోన్ యాప్‌లు వివాదం మళ్లీ బయటికి వచ్చింది. చైన్‌కు చెందిన వారితో దేశంలో నడుస్తున్న లోన్ యాప్‌ల నిర్వాహకులు అమాయకులకు రుణాలు ఇచ్చి వేధింపులకు గురిచేయడంతో వేలాది కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు లోన్ యాప్ నిర్వాహకులను అరెస్టు చేయడంతో వారి ఆగడాలకు చెక్‌పడింది. కొద్ది రోజులు నిశబ్దంగా ఉన్న నిందితులు తర్వాత మళ్లీ రెచ్చిపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో నలుగురు బాధితులు నగర పోలీసులు ఫిర్యాదు చేశారు. యూసుఫ్‌గూడకు చెందిన యువతి రూ.10లక్షలు తీసుకుంది, రుణం ఇచ్చిన నిర్వాహకులు యువతిని వేధింపులకు గురిచేసి రూ.2.9లక్షలు కట్టించుకున్నారు. అయినా కూడా వేధింపులు ఆగకపోవడంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కృష్ణానగర్‌కు చెందిన మహిళ లోన్ యాప్ ద్వారా రూ.33,000 రుణం తీసుకుంది.
బాధితు మహిళకు లోన్ యాప్ నిర్వాహకులు ఫోన్లు చేసి వేధించడమే కాకుండా నకిలీ నోటీస్ లెటర్ హెడ్లు పంపించారు. అంతటితో ఆగకుండా వారి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లతో వాట్సాప్‌గ్రూప్ ఏర్పాటు చేసి మెసేజ్‌లు పెట్టి వేధింపులకు గురిచేశారు. వారి వేధింపులకు తాళలేక బాధితురాలు లక్ష రూపాయలు చెల్లించింది. అయినా కూడా వారి వేధింపులు ఆగకపోవడంతో నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ గో క్యాష్ యాప్ ద్వారా రూ.5,000 రుణం తీసుకున్నాడు. లోన్ యాప్ కాల్ సెంటర్ నిర్వాహకులు తరచూ ఫోన్ చేసి రుణం చెల్లించాలని వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.