మహారాష్ట్రలో 65, ఢిల్లీలో 57, తెలంగాణలో 25,ఎపిలో 2
న్యూఢిల్లీ: బుధవారానికి దేశంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 226కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీల్లో 57, తెలంగాణలో 25, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి. బుధవారం కొత్తగా జమ్మూకాశ్మీర్‌లో 3,ఒడిషాలో 2, ఆంధ్రప్రదేశ్, లడఖ్‌ల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఎపిలో కేసుల సంఖ్య 2కు చేరింది. ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాలకు ఈ వేరియంట్ విస్తరించింది. బుధవారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6317 కాగా, మరణాల సంఖ్య 318. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 3,47,58,481కి, మరణాల సంఖ్య 4,78,325కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 78,190. ఇది 575 రోజుల కనిష్ఠం. 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య 8043. దీంతో,రికవరీ రేట్ 98.40గా నమోదైంది. బుధవారానికి కొవిడ్19 వ్యాక్సిన్ల పంపిణీ 138.96 కోట్లకు చేరింది.
క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలపై ఢిల్లీలో నిషేధం
ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో క్రిస్టమస్, నూతన సంవత్సర వేడుకలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించించి. బహిరంగ ప్రదేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు ఢిల్లీ విపత్తు నిర్వహణ సాధికారసంస్థ(డిడిఎంఎ) తెలిపింది. ఈ ఆదేశాలను అమలు చేయాలని ఢిల్లీ పాలనా యంత్రాంగంతోపాటు పోలీసులను ఆదేశించింది. రోజువారీగా నివేదికలు సమర్పించాలని జిల్లాల అధికారులను ఆదేశించింది. మాస్క్‌లు ధరించని వినియోగదారులను అనుమతించొద్దని మార్కెట్ ట్రేడ్ అసోసియేషన్స్‌ను ఆదేశించింది. మరోవైపు ఒమిక్రాన్‌పై రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వార్‌రూంలు ఏర్పాటు చేసి ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తూ కట్టడి చర్యలు చేపట్టాలని సూచించింది. సమావేశాలపై ఆంక్షలు విధించడంతోపాటు కొవిడ్ పరీక్షలను విస్తృతం చేయాలని సూచించింది. అవసరమైనచోట రాత్రి కర్ఫ్యూలు విధించి, కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది.