న్యూఢిల్లీ : దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు అనేక సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టి సారించాలని, ఒమిక్రాన్ ముప్పు వ్యాపించకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమలులో ఉండేలా చూడాలన్నారు.ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి పండగల వేళ రాత్రి కర్ఫూలను అమలు చేయాలని, భారీ సభలు, సమూహాలను నియంత్రించాలని సూచించారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి, నిబంధనలు అమలు చేయాలన్నారు.
బాధితుల నమూనాలను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలన్నారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, ఆస్పత్రుల్లో పడకల సామర్ధం, అంబులెన్ను, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. వైరస్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మాస్క్‌లు, భౌతిక దూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలన్నారు. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలని, రాబోయే రోజుల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలు, 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Centre Releases Guidelines to States on Omicron