Friday, November 22, 2024

‘సమరానికి’ సై!

- Advertisement -
- Advertisement -

India vs South Africa first test from today

భారత్‌కు సవాల్, భారీ ఆశలతో సౌతాఫ్రికా, నేటి నుంచి తొలి టెస్టు

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి సిరీస్ చాలా కీలకమని చెప్పాలి. అంతేగాక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షలో జరుగుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై నిలిచింది. ఇటు కెప్టెన్ కోహ్లి, అటు హెడ్ కోచ్ ద్రవిడ్‌కు సౌతాఫ్రికా సిరీస్ సవాల్ వంటిదే. ద్రవిడ్‌పై టీమిండియా ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అంతేగాక కెప్టెన్సీ విషయమై భారత క్రికెట్‌లో ప్రస్తుతం విభేదాలు నెలకొన్నాయి. ఇలాంటి స్థితిలో కెప్టెన్ విరాట్ కోహ్లికి అండగా నిలుస్తూ ఇతర ఆటగాళ్లు అతనికి సహకారం అందించేలా ద్రవిడ్ పావులు కదపక తప్పదు. మరోవైపు తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో విరాట్ కోహ్లి బిసిసిఐపై ఆగ్రహంతో ఉన్నాడు. ఒక దశలో అతను రిటైర్మెంట్‌కు కూడా సిద్ధమయ్యాడనే వార్తలు కూడా జాతీయ మీడియాలో వచ్చాయి. ఇక కెప్టెన్సీ వివాదంతో టీమిండియా రెండుగా విడిపోయింది. కొంతమంది క్రికెటర్లు రోహిత్ శర్మకు మద్దతుగా నిలువగా మరొకొందరూ విరాట్ కోహ్లికి అండగా నిలిచారు. అయితే గాయం కారణం వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో కోహ్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

పరీక్ష వంటిదే..

కాగా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ కెప్టెన్ విరాట్ కోహ్లికి సవాల్‌గా మారింది. కెప్టెన్‌గా బ్యాటర్‌గా జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం కోహ్లి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడూ టీమిండియాలో కోహ్లిదే పూర్తి ఆధిపత్యంగా ఉండేది. అయితే ఎప్పుడైతే అతను ట్వంటీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడో అప్పటి నుంచి టీమిండియాలో అతని ప్రభావం ఒక్కసారిగా తగ్గిపోయింది. వన్డే కెప్టెన్సీ విషయంలో సెలెక్టర్లు కోహ్లికి అనూహ్య షాక్ ఇచ్చారు. విరాట్ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించే రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అంతేగాక అజింక్య రహానెను తప్పించి టెస్టుల్లో రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా బోర్డు నియమించింది. ఇలా తనకు అనూహ్య షాక్ ఇచ్చిన బిసిసిఐ పెద్దలకు తానెంటో చూపాలనే పట్టుదలతో విరాట్ ఉన్నాడు.

సౌతాఫ్రికా సిరీస్‌లో బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలో కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సిరీస్‌ను అతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను అందించి టీమిండియాపై తన పట్టును నిలబెట్టుకోవాలని భావిస్తున్నాడు. ఇది కార్యరూపం దాల్చాలంటే కోహ్లి తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. అంతేగాక అందుబాటులో ఉన్న ఆటగాళ్లను సందర్భోచితంగా ఉపయోగించి మంచి ఫలితాలను రాబట్టుకోక తప్పదు. ఇలాంటి స్థితిలో సఫారీతో సిరీస్ కోహ్లికి సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాటింగే కీలకం..

మరోవైపు టీమిండియాకు సిరీస్‌లో బ్యాటింగ్ చాలా కీలకంగా మారింది. సిరీస్‌కు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో మయాంక్ అగర్వాల్, కెఎల్.రాహుల్‌లు ఓపెనర్లుగా దిగడం ఖాయం. న్యూజిలాండ్ సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశమే. ఈసారి కూడా అతను జట్టుకు కీలకంగా మారాడు. ఇక రాహుల్ ఇటీవల కాలంలో నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. అతనిపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. కొంతకాలంగా కోహ్లి పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. ఈసారి జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఏర్పడింది. యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు కూడా తమవంతు సహకారం అందించాల్సిందే వీరిద్దరూ రాణిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. మరోవైపు సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలకు సౌతాఫ్రికా సిరీస్ చావోరేవోగా తయారైంది.

ఈసారి విఫలమైతే ఇద్దరు టీమిండియాలో చోటు కోల్పోవడం ఖాయం. ఇప్పటికే ఇద్దరికీ ఎన్నో అవకాశాలు లభించాయి. అయితే వాటిని తమకు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు. ఇక సౌతాఫ్రికా సిరీస్ వీరికి చివరి ఛాన్స్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిస్తేనే ఇద్దరు రానున్న సిరీస్‌లలో జట్టులో చోటు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ విఫలమైతే మాత్రం టీమిండియాలో చోటు దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. ఇక బౌలింగ్‌లో భారత్ బలంగా ఉంది. ఇషాంత్ శర్మ, బుమ్రా, షమి, ఉమేశ్, సిరాజ్, అశ్విన్, జయంత్, శార్దూల్ తదితరులతో బౌలింగ్ పటిష్టంగా కనిసిస్తోంది. బౌన్స్‌కు సహకరించే సౌతాఫ్రికాలో షమి, ఇషాంత్, బుమ్రాలు కీలకంగా మారే అవకాశం ఉంది. అంతేగాక అశ్విన్ రూపంలో మ్యాచ్ విన్నర్ స్పిన్నర్ భారత్‌కు అందుబాటులో ఉన్నాడు.

సొంత గడ్డపై ఫేవరెట్‌గా..

ఇదిలావుండగా సొంతగడ్డపై ఆడుతున్న సౌతాఫ్రికా సిరీస్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. డీన్ ఎల్గర్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా సిరీస్ విజయమే లక్షంగా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సఫారీ జట్టు బలంగానే ఉంది. ఎల్గర్, మార్‌క్రామ్, వండర్ డుసెన్, డికాక్, బవుమా, ముల్డర్ తదితరులతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో కూడా ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. ఎంగిడి, రబడా, కేశవ్ మహారాజ్‌లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది. దీంతో సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయలేం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News