బీజింగ్ : కరోనా కట్టడికి చైనా ‘జీరో కొవిడ్’ వ్యూహాన్ని అనుసరిస్తున్నప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గేలా కనిపించడం లేదు. ఫిబ్రవరిలో ఒలింపిక్స్ క్రీడోత్సవాల నిర్వహణకు సన్నద్ధమౌతున్న పరిస్థితుల్లో ఒక్కసారి అకస్మాత్తుగా కరోనా కొత్త కేసులు 206 కు చేరుకున్నాయి. ఈ కొత్త కేసుల్లో షాంక్సి నుంచి 157, గుయాంగ్సీ ప్రావిన్సు నుంచి ఒకటి, నమోదు కాగా, విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల 48 కేసులు నమోదయ్యాయని చైనా హెల్త్ కమిషన్ ఆదివారం వెల్లడించింది. తియాన్‌జిన్ సిటీలో డిసెంబర్ 13న ఒమిక్రాన్ కేసు ఒకటి నమోదైందని, అయితే దీని వ్యాప్తి గురించి వివరాలు అంతగా లేవని అధికారులు తెలిపారు.
డిసెంబర్ మధ్యలో ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో డెల్టా వేరియంట్ బయటపడగా నియంత్రించడమైందని చెప్పారు. శనివారం నాటికి చైనాలో 2011 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి. దేశీయంగా కొవిడ్ కేసుల వ్యాప్తితోపాటు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు లోకి తెచ్చింది. జిల్లాల్లోని వారంతా అత్యవసర పని ఉంటే తప్ప దేశ రాజధాని బీజింగ్‌కు రావద్దని, అలాగే బీజింగ్ నగర ప్రజలు నగరాన్ని విడిచి ఎక్కడకు ప్రయాణించరాదని ఆంక్షలు కట్టుదిట్టం చేసింది.