న్యూఢిల్లీ : కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిపై ఎన్నికల కమిషన్ సోమవారం సమీక్ష జరిపింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలను మరి కొన్ని రోజుల పాటు వాయిదా వేయడం మంచిదన్న వాదనలు వినిపిస్తున్నా ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి లేదని విశ్వసనీయ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రానున్న మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపధ్యం సోమవారం వివిధ విభాగాల ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఎన్నికల సందర్భంగా మాదక ద్రవ్యాల ప్రభావం ఓటర్లపై ఏమాత్రం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉన్నతాధికారికి సూచించింది. ఈ సందర్భంగా పంజాబ్, గోవాల్లో డ్రగ్ స్మగ్లింగ్‌ను ప్రస్తావించింది.
ఐటిబిపి, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి విభాగాల ఉన్నతాధికారులతో ఎన్నికల కమిషన్ వివిధ అంశాలపై సమీక్ష జరిపింది. ఎన్నికలు జరగనున్న కొన్ని రాష్ట్రాలు అంతర్జాతీయ సరిహద్దులతో ముడిపడి ఉన్నందున గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ దేశం లోని ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ , ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితిని, ఒమిక్రాన్ వ్యాప్తిని, నిబంధనల అమలును వివరించారు. టీకా పంపిణీ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంపిణీ వేగంగా పూర్తి చేయాలని కమిషన్ సూచించింది. గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీల గడువు వచ్చే మార్చిలో వివిధ తేదీల్లో ముగియనుండగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు మేతో ముగుస్తుంది. వచ్చే నెలలో ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించే అవకాశం ఉంది., ప్రధాన ఎన్నికల కమిషనరు, తోటి కమిషనర్లు మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించనున్నారు.