హైదరాబాద్: నగరంలోని ఓవైసీ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్లై ఓవర్‌ను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌వే మార్గంగా మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 1.36 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్లైఓవర్‌పైన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అత్యంత వాహన రద్దీగల ఎల్‌బినగర్-ఆరాంఘర్ మార్గంలో ఓవైసీ జంక్షన్ వద్ద ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు.
మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.80 కోట్లు కాగా ఇందులో రూ.63 కోట్లు ప్లైఓవర్ నిర్మాణానికి, మిగిలిన రూ.17 కోట్లు భూసేకరణకు ఖర్చు చేశారు. దక్షిణ ప్రాంతంలో ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన తొలిప్లైఓవర్ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లే మార్గం కూడా కావడంతో ట్రాఫిక్ సమస్య తలేత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలకు మార్గం సుగమణమైంది.
KTR Inaugurate Flyover at Owaisi Junction