తిరుమల: ఈ సారి పది రోజుల పాటు వైకుంఠ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు టిటిడి అదనపు ఇవో ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనవరీ 1, 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే టికెట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. శ్రీవారి భక్తులు ఖచ్చితంగా కోవిడ్ సర్టిఫికేట్ తీసుకొని రావాలని సూచించారు.టికెట్లు కలిగివుండి కోవిడ్ లక్షణాలు వుంటే దయచేసి తిరుమలకు రావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 5వేల టికెట్లు కేటాయిస్తామని చెప్పారు. తిరుపతిలో కేటాయించే ఆఫ్ లైన్ టికెట్లు కేవలం తిరుపతి వాసులకు మాత్రమేనన్నారు. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి ట్రస్ట్ భక్తులకు కూడా మహాలఘు దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తులకు వసతి సమస్య లేకుండా తిరుపతిలో బస చేయాలని కోరారు. తిరుమలలో 1300 రూములు రెనువేషన్ లో వున్నాయని తెలిపారు. గదుల అడ్వాన్స్ బుకింగ్ లను రద్దు చేయనున్నట్లు చెప్పారు. తిరుమలలో 11వ తేది సాయంత్రం నుండి 24 గంటల పాటు గదుల కేటాయింపు వుండదన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం బంగారు రథంపై శ్రీవారు మాడ వీధిలో దర్శనం ఇస్తారని వెల్లడించారు. జనవరి 1వ తేదీన చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు, ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీవారి ప్రసాదాలు అందుబాటులో వుంటాయని పేర్కొన్నారు.
Vaikunta Darshan at Tirumala on Jan 1