దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టెస్టు ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్2021 అవార్డు రేసులో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ అవార్డు కోసం మొత్తం నలుగురు క్రికెటర్లు నామినేట్ అయ్యారు. వీరిలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కైల్ జేమీసన్, శ్రీలంక టెస్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఉన్నారు. ఈ ఏడాది అశ్విన్ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన అశ్విన్ 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతేగాక బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. 28.07 సగటుతో 337 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకం కూడా ఉంది. మరోవైపు జోరూట్ బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. 15 మ్యాచుల్లో ఏకగా 1708 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఐదు శతకాలు కూడా నమోదు చేశాడు. బ్యాటర్‌గా రాణించినా కెప్టెన్‌గా మాత్రం రూట్ ఘోరంగా విఫలమయ్యాడు. కాగా, కివీస్ ఆల్‌రౌండర్ జేమీసన్ కూడా ఉత్తమ క్రికెటర్ అవార్డు రేసులో నిలిచాడు. ఈ సీజన్‌లో జేమీసన్ 17.51 సగటుతో 27 వికెట్ల పడగొట్టాడు. మరోవైపు శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఏడు టెస్టుల్లో 902 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ నలుగురు క్రికెటర్లు ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది ఇయర్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికీ ఈ అవార్డు వరిస్తుందో వేచి చూడాల్సిందే.