దక్షిణాఫ్రికా నిపుణుల తాజా అధ్యయనం
జొహన్నెస్‌బర్గ్ : ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మెరుగైన స్థాయిలో పెరుగుతున్నట్టు దక్షిణాప్రికా నిపుణుల తాజా అధ్యయనం వెల్లడించింది. ఒకవేళ ఇదే కొనసాగితే డెల్టాతో రీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడడంతోపాటు తీవ్ర వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతో ఒమిక్రాన్ దోహదం చేస్తున్నట్టు అంచనా వేసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఒమిక్రాన్ సోకిన ఓ 33 మందిపై దక్షిణాఫ్రికా నిపుణులు అధ్యయనం చేపట్టారు. వ్యాక్సిన్ తీసుకున్న , తీసుకోని వారిని పరిగణన లోకి తీసుకున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టాను తటస్థీకరించే సామర్ధం పెరిగినట్టు గుర్తించారు. దీనర్ధం మరోసారి డెల్టా సోకే సామర్ధం తగ్గడమేనని నిపుణులు వెల్లడించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉందా? లేదా అనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఒకవేళ అదే నిజమైతే కొవిడ్ తీవ్రత తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని వెల్లడించారు. ఇలా దక్షిణాఫ్రికా అనుభవాలను బట్టి ఒమిక్రాన్ తక్కువ వ్యాధికారకమైనదే అయితే డెల్టాను పారద్రోలడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని అఫ్రికా ఆరోగ్య పరిశోధనా సంస్థ లోని ప్రొఫెసర్ అలెక్స్ సిగాల్ వెల్లడించారు.