న్యూఢిల్లీ: భారత్‌లో మరికొన్ని రోజుల్లోనే కొవిడ్19 కేసులు ఉధృతస్థాయికి చేరుతాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం తెలిపింది. రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతాయని అంచనా వేసింది. ఈ వారంలోనే కేసుల సంఖ్య అధికమవుతుందని.. అయితే, సంఖ్యను కచ్చితంగా అంచనా వేయడం అంత సులభం కాదని జడ్జి బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ పాల్‌కట్టుమన్ తెలిపారు. ఈయన ఆధ్వర్యంలోనే భారత్‌లో కొవిడ్19 ప్రభావాన్ని అంచనా వేసే ట్రాకర్‌ను రూపొందించారు. డిసెంబర్ 24న 6 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడాన్ని ఈ బృందం గుర్తు చేసింది. ఈ రాష్ట్రాల్లో కొత్త కేసుల పెరుగుదల రేట్ 5 శాతానికిపైగా నమోదైందని తెలిపింది. డిసెంబర్ 26వరకల్లా కేసుల పెరుగుదల 11 రాష్ట్రాల్లో నమోదైందన్నారు. అయితే, కేసుల ఉధృతి స్వల్పకాలమే ఉంటుందని కూడా వారు అంచనా వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కట్టడి చర్యలను రాష్ట్రాలకు సూచించడం, వ్యాక్సినేషన్‌ను పెంచడంలాంటివాటిని పరిశోధక బృందాలు పరిగణనలోకి తీసుకుంటాయి.